సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ నటి కంగనా రనౌత్ ఈనెల 9న ముంబై పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాల (సీఆర్‌పీఎఫ్) డిప్యూటీ కమాండెంట్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), హిమాచల్‌ప్రదేశ్ పోలీసు అధికారులు మనాలీలోని ఆమె నివాసాన్ని మంగళవారం సందర్శించారు. శివసేన నుంచి బెదిరింపుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై కేటగిరీ భద్రతను కల్పించడంతో కంగనా ఇంటి వద్ద పోలీస్ బృందాలను మోహరించారు. చదవండి : ‘క్వీన్’కు కేంద్రం రక్షణ!
ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పోల్చుతూ కంగనా చేసిన ప్రకటనపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అభ్యంతరంతో ఇరువురి మధ్య వివాదం ముదిరిన సంగతి తెలిసిందే. ఈనెల 9న ముంబైలో అడుగుపెడతానని, దమ్ముంటే తనను అడ్డుకోవాలని కంగనా సవాల్ విసిరారు. కాగా హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ బాలీవుడ్ క్వీన్‌కు బాసటగా నిలిచారు. కంగనా రనౌత్ హిమాచల్‌ప్రదేశ్ ముద్దుబిడ్డని వ్యాఖ్యానించారు. కంగనా భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి తనకు లేఖ రాసిన మీదట దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరానని తెలిపారు. మనాలీలో ఆమె ఇంటివద్ద పోలీస్ టీమ్‌ను నియమించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment