పనాజీ : వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్న వారు దళారులకే దళారులుగా వ్యవహరిస్తున్నారని అభివర్ణించారు. ప్రస్తుతం రైతులు తక్కువ ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకుంటుండగా, వినియోగదారులు అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వ్యవసాయ బిల్లులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గోవాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వివరించారు. దళారులు రైతుల నుంచి కారుచౌకకు కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ధరలను పెంచేసి లాభాలు దండుకుంటున్నారని , ఈ దళారులను ఏరివేయడం ద్వారా వ్యవసాయ బిల్లులు ఈ సమస్యను తొలగిస్తాయని మంత్రి పేర్కొన్నారు. విపక్షాలు దళారుల కొమ్ముకాస్తూ దళారుల కోసం దళారులుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన సమసిపోతుందని అసత్యాలకు త్వరలో కాలం చెల్లుతుందని, వాస్తవం మాత్రం శాశ్వతమని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని, అయితే వ్యవసాయ సంస్కరణలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన ప్రసంగాల్లో పలుమార్లు పిలుపుఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యూటర్న్ తీసుకుందని అన్నారు. వ్యవసాయ బిల్లులతో వ్యవసాయ మార్కెట్ కమిటీలు మూతపడతాయని విపక్షాలు దుష్ర్పచారం సాగిస్తున్నాయని ఆరోపించారు. కనీస మద్దతు ధరపై వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు నిలిచిపోతుందని ప్రచారం చేస్తున్నారని ఇవన్నీ అసత్యాలేనని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment