న్యూఢిల్లీ: ఈ నెల 18వ తేదీన జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్‌డీఏ, ప్రతిపక్షాల తరఫున నామినేషన్లు వేసిన ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాలు బరిలో మిగిలారు. నామినేషన్ల పరిశీలన అనంతరం గురువారం రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ఈ విషయం ప్రకటించారు. ఆఖరి రోజైన బుధవారం వరకు 94 మంది 115 నామినేషన్లు వేశారన్నారు. నిర్ణీత ప్రమాణాల మేరకు లేని కారణంగా వీటిలో 107 నామినేషన్‌లను తిరస్కరించామన్నారు.
ముర్ము, సిన్హాలు దాఖలు చేసిన నాలుగేసి సెట్ల చొప్పున నామినేషన్ పత్రాలు నిర్దేశిత అన్ని వివరాలతో ఉన్నందున వీటిని ఆమోదించినట్లు వివరించారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 2వ తేదీతో ముగుస్తుందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత గెజిట్‌లో ప్రచురిస్తామన్నారు. ముర్ము, సిన్హాతోపాటుగా రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేసిన వారిలో పలువురు సామాన్యులు కూడా ఉన్నారు. ముంబై మురికి వాడ వాసి, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త, ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్‌తోపాటు ఆర్‌జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తరఫున ఈసారి నామినేషన్లు పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment