
లక్నో/అయోధ్య: రాముడు లేనిదే అయోధ్య లేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్న ప్రాంతం రామ్ లల్లాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం సందర్శించారు. పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య తాత్కాలిక మందిరం దగ్గర పూజలు నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఒక మొక్కను నాటిన కోవింద్ అక్కడ పురోహితులతో కాసేపు మాట్లాడారు. 2019లో సుప్రీంకోర్టు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వీలుగా చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన తర్వాత కోవింద్ అయోధ్యకు రావడం ఇదే మొదటిసారి.
యూపీ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా చివరిరోజు కోవింద్ లక్నో నుంచి అయోధ్యకి రైలులో వచ్చారు. సాంస్కృతిక, పర్యాటక శాఖ చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రామాయణ ఘట్టాలతో కూడిన పోస్టల్ కవర్‌ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాముడు లేని అయోధ్య అయోధ్యే కాదన్నారు. ‘‘రాముడు ఎక్కడుంటే అక్కడే అయోధ్య ఉంటుంది. ఈ నగరంలోని రాముడు శాశ్వతంగా ఉంటాడు’’అని కోవింద్ వ్యాఖ్యానించారు. రాముడు ఎప్పుడూ గిరిజనులపై వల్లమాలిన ప్రేమాభిమానాలు కురిపించారని రాష్ట్రపతి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment