న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు కేంద్ర మంత్రుల బృందం రైతులతో చర్చలు జరుపుతున్నప్పటికి పెద్దగా ఫలితం లేకుండా పోయింది. కేంద్రం బేషరతుగా నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు రైతులుకు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ప్రొఫెషనల్ రెజ్లర్ దలీప్ సింగ్ రానా అకా ది గ్రేట్ ఖలీ చేరారు. రైతులకు మద్దతిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటన చేశారు దలీప్ సింగ్. అలానే దేశవ్యాప్తంగా ప్రజలను రైతులకు మద్దతివ్వాల్సిందిగా అభ్యర్థించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు ఖలీ. ‘వారు(రైతులు) రెండు రూపాయలకు అమ్ముకుని.. 200 వందల రూపాయలకు కొనుక్కుంటారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాల వల్ల రోజు కూలీలు, రోడు పక్క వ్యాపారులు.. సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేంద్రం రైతుల డిమాండ్లను ఒప్పుకోవాలంటే మనమంతా వారికి మద్దతివ్వాలి’ అని హిందీలో కోరారు. అంతేకాక పంజాబ్, హరియాణా రైతులను ఒప్పించడం కేంద్రానికి అంత సులభం కాదన్నారు. (చదవండి: ‘కేజ్రీవాల్.. మొసలి కన్నీళ్లు కార్చొద్దు‘)
ఇక ఇప్పటికే రైతుల నిరసనకు పలువురు పంజాబ్ గాయకులు, నటులు మద్దతు తెలుపుతున్నారు. వీరిలో సిద్దూ మూసేవాలా, బబ్బూ మాన్‌లు కూడా ఉన్నారు. గాయకులు కన్వర్ గ్రెవాల్, హర్ఫ్ చీమా ఢిల్లీ సరిహద్దులో జరిగిన నిరసనలలో చేరారు. మొత్తం ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన గాయకుడు జస్బీర్ జాస్సీ కూడా ఆందోళనకు తన మద్దతు తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌కు చెందిన వేలాది మంది రైతులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్స్‌ని లెక్క చేయకుండా ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత కేంద్రం వీరిని ఢిల్లీలోకి అనుమతించలేదు.. ఆ తర్వాత పోలీసు పహారా మధ్య రైతులను రాజధానిలోని బురారీలోనికి రానిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment