‘విజయ్‌’ దాడికి ‘రంగసామి’ కోట బద్దలు? | Puducherry Elections Analysis NDAds Stability Vijays Disruption | Sakshi
Sakshi News home page

‘విజయ్‌’ దాడికి ‘రంగసామి’ కోట బద్దలు?

Apr 4 2026 7:58 AM | Updated on Apr 4 2026 9:20 AM

Puducherry Elections Analysis NDAds Stability Vijays Disruption

రెండు దశాబ్దాల రాజకీయ సంప్రదాయం ఒకవైపు.. మార్పు కోరుకునే కొత్త తరం మరోవైపు.. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు- 2026 వేళ ఈ కేంద్రపాలిత ప్రాంతం ఒక రసవత్తర పోరాటానికి వేదికైంది. గత 20 ఏళ్లుగా ఏ అధికార పార్టీ కూడా వరుసగా రెండోసారి పీఠాన్ని దక్కించుకోని ‘రివాజు’ పుదుచ్చేరి సొంతం. ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి, చరిత్ర తిరగరాయాలని ముఖ్యమంత్రి ఎన్. రంగసామి భావిస్తుంటే, తన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీతో ఎంట్రీ ఇచ్చి, సమీకరణలను తలకిందులు చేసేందుకు ‘దళపతి’ విజయ్ సిద్ధమయ్యారు. దీంతో పుదుచ్చేరి రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.

వెంటాడుతున్న నకిలీ ఔషధాల కుంభకోణం
ప్రస్తుత ముఖ్యమంత్రి రంగసామికి తన వ్యక్తిగత ఇమేజ్, సంక్షేమ పథకాలు కొండంత అండగా నిలిచాయి. కేంద్రంలోని బీజేపీ దన్ను, నిధుల లభ్యత ఎన్‌డీఏ కూటమికి బలాన్నిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో బీజేపీకి బలమైన క్యాడర్ లేకపోవడం, నకిలీ ఔషధాల కుంభకోణం వంటి ఆరోపణలు ప్రభుత్వానికి మైనస్‌గా మారాయి. వీటన్నింటికీ మించి ఇరవై ఏళ్లుగా కొనసాగుతున్న అసంతృప్తిని తట్టుకుని రంగసామి గట్టెక్కుతారా అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. అధికారాన్ని నిలబెట్టుకోవడం ఆయనకు జీవన్మరణ సమస్యగా మారింది.

సీనియర్ల అసంతృప్తితో..
మరోవైపు కాంగ్రెస్-డీఎంకే కూటమి బలమైన పునాదులతో బరిలోకి దిగుతోంది. క్షేత్రస్థాయిలో నెట్‌వర్క్, ప్రత్యేక రాష్ట్ర హోదా సెంటిమెంట్ వీరికి కలిసొచ్చే అంశాలు. అయితే లోలోన రగులుతున్న విభేదాలు, సీట్ల పంపకంలో జాప్యం, సీనియర్ల అసంతృప్తి ఈ కూటమిని బలహీనపరుస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఈ కూటమి తన ఖాతాలో వేసుకుంటుందా? లేక అంతర్గత కుమ్ములాటలతో ప్రత్యర్థులకు అవకాశం ఇస్తుందా? అనేది వేచి చూడాలి. నాయకత్వ సమస్యలను అధిగమిస్తేనే  కాంగ్రెస్‌కు పుదుచ్చేరిలో మనుగడ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

జయాపజయాలను శాసించే ‘కింగ్ మేకర్’
ఇక ఈ ఎన్నికల్లో అసలైన ‘ఎక్స్‌-ఫ్యాక్టర్’ సినీ నటుడు విజయ్. దళపతికి ఉన్న తిరుగులేని క్రేజ్, యువతలో ఉన్న ఫాలోయింగ్ టీవీకే పార్టీకి ప్రధాన బలం. ఇప్పటికే ఇతర పార్టీల కీలక నేతలను ఆకర్షిస్తూ విజయ్ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. అయితే బూత్ లెవల్ మేనేజ్‌మెంట్ లేకపోవడం, రెండో శ్రేణి నాయకత్వం లోపించడం వంటి సవాళ్లు ఆయన ముందున్నాయి. విజయ్ స్వయంగా గెలిచినా, గెలవకపోయినా.. ఆయన చీల్చే ఓట్లు ఇతర పార్టీల జయాపజయాలను శాసించే ‘కింగ్ మేకర్’ స్థాయికి ఆయన్ని తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

అసలు యుద్ధమంతా ఇక్కడే..
భౌగోళికంగా చూస్తే మొత్తం 30 స్థానాల్లో 23 స్థానాలు పుదుచ్చేరి జిల్లాలోనే ఉండటంతో అసలు యుద్ధమంతా నగరం చుట్టూనే కేంద్రీకృతమైంది. కారైకాల్, మాహే, యానాం ప్రాంతాల ఓటర్లు కూడా కీలకం కానున్నారు. 2021 ఎన్నికల్లో గెలిచిన ఎన్‌డీఏ ఈసారి ఆ విజయపరంపరను కొనసాగిస్తుందా? లేక గత రెండు దశాబ్దాల చరిత్ర పునరావృతమై అధికారం మారుతుందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ప్రత్యేక రాష్ట్ర హోదా, నిరుద్యోగం వంటి అంశాలే ఇక్కడ ప్రధాన అజెండాగా మారాయి.

అత్యంత ఆసక్తికర ఘట్టం
2026 మే ఫలితాలు పుదుచ్చేరి రాజకీయాల్లో ఒక నవశకాన్ని ఆవిష్కరించబోతున్నాయి. రంగసామి తన అనుభవంతో ‘రివాజు’ మారుస్తారా? లేక విజయ్ తన ‘దళపతి’ మార్క్ చూపిస్తూ కొత్త రికార్డు సృష్టిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఓట్ల చీలిక ఎవరిని ముంచుతుందో, ఎవరిని తేలుస్తుందో కానీ పుదుచ్చేరి పీఠం కోసం జరుగుతున్న ఈ ‘ముక్కోణపు పోరు’ మాత్రం భారత రాజకీయాల్లోనే అత్యంత ఆసక్తికరమైన ఘట్టంగా నిలవబోతోంది.

ఇది కూడా చదవండి: ‘నిజాలు కక్కించే’.. మైండ్ బ్లోయింగ్ ఏఐ డివైజ్!

Advertisement
 
Advertisement
Advertisement