దేశ చరిత్రలో తొలిసారిగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. భారత ఎన్నికల సంఘం ప్రకారం.. 85 ఏళ్లు పైడిన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చే పని లేకుండా ఇంటి నుంచే ఓటు వేయవచ్చు.
5 వేల మందికి పైగా శతాధికులు
పంజాబ్‌లో ఇంటి నుంచి ఓటు వేసేందుకు అర్హులైన వారిలో 100 నుంచి 119 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు ఐదు వేల మందికి పైగా ఉన్నారు. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సిబిన్ ప్రకారం.. ఈ రాష్ట్రంలో మొత్తం 205 మంది 120 ఏళ్లు పైబడిన ఓటర్లు ఉన్నారు. ఇందులో 122 మంది పురుషులు, 83 మంది మహిళలు ఉన్నారు.
ఇక 100 నుంచి 119 ఏళ్ల మధ్య వయసువారు మొత్తం 5,004 మంది ఉన్నారు. 100 నుండి 109 సంవత్సరాల వయసువారిలో 1,917 మంది పురుషులు, 2,928 మంది మహిళలు ఉన్నారు. అలాగే 110 నుండి 119 ఏళ్ల ఓటర్ల విషయానికి వస్తే పురుషులు 59 మంది, మహిళలు 100 మంది ఉన్నారు.
మొదటిసారి ఓటర్లు
పంజాబ్‌లో మొత్తం 2,12,71,246 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,11,92,959 మంది పురుషులు, 1,00,77,543 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 4,89,631 మంది 18-19 ఏళ్లలోపువారు అంటే మొదటి సారి ఓటర్లు.
పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న ఏడవ దశలో పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో ఓటింగ్ శాతం 65.96 శాతం నమోదైంది. ఈసారి 70 శాతానికి పైగా ఓటింగ్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment