వీరేశ్ కుమార్ భవ్రా
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడానికి కొద్ది గంటల ముందు రాష్ట్రంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఎన్నికల వేళ శాంతిభద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)ని మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి వీరేశ్ కుమార్ భవ్రాను పంజాబ్ కొత్త డీజీపీగా నియమిస్తూ శనివారం ఉత్తర్వులొచ్చాయి.
కొంతకాలంగా భవ్రా పంజాబ్ హోంగార్డ్స్ డీజీపీగా కొనసాగుతున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) షార్ట్‌లిస్ట్ చేసిన ముగ్గురు అధికారుల ప్యానెల్ నుంచి భవ్రాను చరణ్‌జీత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని పంజాబ్ సర్కార్ ఎంపికచేసింది. దీంతో భవ్రాను డీజీపీగా పంజాబ్ గవర్నర్ నియమించారు. బాధ్యతలు చేపట్టాక భవ్రా కనీసం రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. గత మూడు నెలలకాలంలో పంజాబ్‌కు కొత్త డీజీపీ రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం యూపీఎస్‌సీ పంపిన షార్ట్‌లిస్ట్‌లోని ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా ఎంచుకోవాలి.
కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దిన్‌కర్ గుప్తా డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు. అమరీందర్ తప్పు కున్నాక చన్నీ సీఎం అయ్యారు. గత సెప్టెంబర్‌లో 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోతాను డీజీపీగా చన్నీ ఎంచుకున్నారు. అయితే సహోతా నియామకాన్ని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ తీవ్రంగా వ్యతిరేకించారు. సిద్ధూ ఒత్తిడికి తలొగ్గిన చన్నీ సర్కార్.. సహోతాను తప్పించింది. రెగ్యులర్ డీజీపీ నియామకం జరిగే లోపు బాధ్యతలు నిర్వహించేందుకు 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ ఛటోపాధ్యాయను చన్నీ ప్రభుత్వం డీజీపీ పీఠంపై కూర్చోబెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment