దేశంలో ఎక్కడ విన్నా ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ పేరే వినిపిస్తోంది. సినిమా రేంజ్‌లో ట్విస్ట్ ఇస్తూ వేషాలు మారుస్తూ ఐదు రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కార్లు, బైకులు మారుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఇక, అమృత్‌పాల్ దేశం విడిచి పాకిస్తాన్, నేపాల్‌లోకి వెళ్లినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉండగా.. అమృత్‌పాల్ పరారీ నేపథ్యంలో ఆయన భార్య కిరణ్‌దీప్ కౌర్‌పై పోలీసులు నిఘా పెంచారు. కిరణ్‌దీప్ సహా ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు బుధవారం విచారించారు. మహిళా పోలీసు అధికారితో సహా పోలీసు బృందం దాదాపు గంటపాటు కిరణ్‌దీప్ కౌర్ ఆమె తండ్రి తార్సేమ్ సింగ్, తల్లిని విచారించింది. అమృత్‌పాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై కిరణ్‌దీప్ కౌర్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఫండింగ్ గురించి పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది.
ఇక, కిరణ్‌దీప్ యూకేకు చెందిన ఎన్నారై. ఆమె స్వస్థలం పంజాబ్‌లోని జలంధర్. కిరణ్‌దీప్‌ను అమృత్‌పాల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లిచేసుకున్నాడు. వీరి పెళ్లి జల్లూపూర్ ఖేడాలో జరిగింది. కాగా, పెళ్లి తర్వాత తన భార్యను అమృత్‌పాల్ తనతోనే ఇండియాలోనే ఉండాలని కోరాడు. ఇది విదేశాల నుంచి పంజాబీల రివర్స్ మైగ్రేషన్‌ను పోత్సహించేందుకు ఉపయోగపడుతుందని ఆమెకు చెప్పినట్టు సమాచారం. మరోవైపు.. కిరణ్‌దీప్ కౌర్ కెనడా వెళ్లేందుకు ఇప్పటికే వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో, అమృత్‌పాల్ భారత్ విడిచి కెనడా పారిపోయే అవకాశం ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అమృత్‌పాల్ ఎక్కడున్నాడో తెలియకపోవడంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్(బీఎస్‌ఎఫ్)ను కేంద్రం అప్రమత్తం చేసింది.
మరోవైపు, అంతకు ముందు.. విదేశీ ఖలిస్థానీ సానుభూతిపరుల ద్వారా వచ్చిన డబ్బుతో అమృతపాల్ అక్రమ ఆయుధాలతో పాటు 35 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కూడా కొనుగోలు చేశాడు. అతడికి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయంటూ భద్రతా సంస్థలు గుర్తించాయి. పంజాబ్‌లో శాంతిభద్రతలను అస్థిరపరిచేందుకు యువ సిక్కులను తన గ్రూపు కిందకు తీసుకురావాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment