ఇంఫాల్: మణిపూర్‌లో అల్లర్లు మొదలై రెండు నెలలకు పైబడుతోంది. ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితి చక్కబడుతోంది. మెల్లిగా జనజీవనం కూడా యధాస్థితికి చేరుకుంటోంది. అంతలోనే మయన్మార్ నుండి 700 కు పైగా వలసదారులు మణిపూర్‌లో అడుగుపెట్టారు. రాష్ట్ర సరిహద్దు చుట్టూ వేల సంఖ్యలో అస్సాం రైఫిల్స్ ను కాపలా పెట్టినా సరైన డాక్యుమెంట్లు లేకుండా అంతమంది రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించారన్నదే ప్రభుత్వాన్ని తొలిచేస్తున్న ప్రధాన ప్రశ్న.
మే 3 నుండి మణిపూర్‌లో జరిగిన హింసాకాండకు యావత్ భారతదేశం నివ్వెరపోయింది. ఈశాన్య రాష్ట్రాల్లో నివసించే రెండు జాతుల మధ్య వైరుధ్యం కారణంగా చెలరేగిన అల్లర్లు సుమారు 150 మందిని పొట్టనబెట్టుకున్నాయి. ఎన్నో ఇళ్ళు దగ్ధమయ్యాయి. ఏ వీధిని చూసిన సగం కాలిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. 40 వేలకు పైగా రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయారు.
ఒకపక్క ప్రాణాలను చేత బట్టుకుని మణిపూర్ వాసులు వలస పోతుంటే పక్క దేశం నుండి అగ్నిగుండంలా ఉన్న రాష్ట్రంలోకి వలసలు వస్తున్నారు. హోంశాఖ తెలిపిన విసరాల ప్రకారం జులై 22, 23 లోనే మయన్మార్ నుండి 718 మంది వలసవచ్చారు. వీరంతా ఎవరనేది మణిపూర్ ప్రభుత్వానికి ఎదురవుతున్న మొదటి ప్రశ్న.
బ్రతుకు తెరువు కోసమే వచ్చారా లేక ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించడానికి వచ్చారా? అన్నదానిపై స్పష్టత లేదు. వారు ఆయుధాలు ఏవైనా వెంట తెచ్చుకున్నారా అన్న సమాచారం కూడా హోంశాఖ వద్ద లేదు. సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రతా దళాలు ఉన్నప్పటికీ వారి వద్ద సరైన పత్రాలు ఉన్నాయా లేవా అన్నది పరిశీలించకుండానే అనుమతించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇది కూడా చదవండి: ఆగ్రాలో మరో దారుణం.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన
Comments
Please login to add a commentAdd a comment