అందుకే మోదీ రాజ్యాంగ ప్రతిలో ఏమీ లేదంటున్నారు
‘తెల్లకాగితాలు’ వ్యాఖ్యలను తిప్పికొట్టిన రాహుల్ గాంధీ
నందూర్‌బార్(మహారాష్ట్ర): తాను తరచూ ప్రదర్శించిన ఎరుపురంగు రాజ్యాంగప్రతి అంతా ఖాళీ అంటూ ప్రధాని మోదీసహా అధికార బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు లోక్‌సభలో విపక్ష నేత గట్టి సమాధానమిచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నందూర్‌బాగ్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ ప్రధానిపై విమర్శలు గుప్పించారు.
‘‘ రాజ్యాంగ ప్రతి కవర్ ఎరుపు రంగులో ఉందా నీలం రంగులో ఉందా అనేది మనం ఎప్పుడూ చూడలేదు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధపడ్డాం. ఇంతటి ఘనత గల రాజ్యాంగంలో ఏమీ లేదని, ఏమీ ఉండదని ప్రధాని మోదీజీకి గట్టి నమ్మకం కల్గిందేమో. ఎందుకంటే జీవితంలో ఆయన ఎప్పుడూ ఈ రాజ్యాంగాన్ని చదివిఉండరు. ఏమీ ఉండదనే చదవలేదనుకుంటా. అందుకే నేను ర్యాలీల్లో చూపించే ఎరుపురంగు రాజ్యాంగప్రతి లోపల అన్నీ తెల్లపేజీలే అని చెబుతున్నారు.
మోదీజీ ఇది ఖాళీ పుస్తకం కాదు. భారతీయ ఆత్మ, జ్ఞానానికి ఆలవాలం ఈ పుస్తకం. బిర్సా ముండా, బుద్ధుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా పూలే, మహాత్మాగాంధీల ఆత్మతో భారత రాజ్యాంగం నిండి ఉంది. అయినాసరే మీరు ఈ పుస్తకం ఖాళీ అని అంటున్నారంటే మీరు వీళ్లందరినీ అవమాని స్తున్నట్లే’’ అని రాహుల్ అన్నారు.
‘‘ ఆదివా సీలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు నిర్ణయాధికారం దక్కాలి కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లు గిరిజనులను ఆదివాసీలు అని సంభోదించకుండా వనవాసులు అని పిలుస్తు న్నారు. నీరు, భూమి, అడవిపై తొలి హక్కు దారులు ఆదివాసీలే. ఎలాంటి హక్కులు కల్పించకుండా బీజేపీ ఆదివాసీలను అడవికి పరిమితం చేసింది. బిర్సా ముండా ఇవే హక్కుల కోసం పోరాడి వీరమరణం పొందారు’’ అని రాహుల్ అన్నారు.
మేనిఫెస్టోను ప్రస్తావించిన రాహుల్
‘‘మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంబీఏ) జనప్రయోజన వాగ్దానాలతో మేనిఫెస్టోను మీ ముందుకు తెచ్చింది. అధికారంలోకి వస్తే మా కూటమి సర్కార్ రైతులు, యువతకు నెలకు రూ.3,000 ఆర్థిక తోడ్పాటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.3,00,000 దాకా రుణమాఫీ, నిరుద్యోగయువతకు నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి అందించనుంది. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీల అసలైన జనసంఖ్య తెలిస్తే వారికి ఆ మేరకు వనరుల్లో న్యాయమైన వాట దక్కుతుంది. అందుకు జనగణన ఎంతగానో దోహదపడనుంది. ప్రస్తుతం 80 శాతం గిరిజనుల జనాభాలో నిర్ణాయాత్మక స్థాయి లో కేవలం ఒక శాతం మంది మాత్రమే ఉన్నారు’’ అని అన్నారు.
ఒక్కరే ఆదివాసీ ఆఫీసర్
‘‘కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత ఉన్న తాధికారులు 90 మంది ఉంటే వారిలో ఆదివాసీ వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఉదాహరణకు ఈ 90 మంది అధికారులు రూ.100 విలువైన ప్రజాపనులపై నిర్ణయాలు తీసుకుంటే ఆదివాసీ అధికారి నిర్ణయంపై ఆధారపడే పనుల విలువ కేవలం 10 పైసలు. మొత్తంగా చూస్తే పనిచేసే ఆ కొద్ది మంది ఆదివాసీ అధికారులను కీలకమైన శాఖల్లో ఉండనివ్వ రు. అప్రాధాన్యమైన విభాగాల్లో, పోస్టుల్లో నియమిస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. మనం ఈ పద్ధతిని మారుద్దాం’’ అని రాహుల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment