చెన్నై: ప్రస్తుతం యూట్యూబ్‌లో బాగా పాపులర్ చానెల్స్ ఏంటి అంటే వంటల వీడియోలకు సంబంధించిన చానెల్స్. సరదాగా మొదలు పెట్టిన వారు ఇప్పుడు తమ పాక శాస్త్ర ప్రావీణ్యంతో జనాలను ఆకట్టుకుని.. లక్షల్లో సంపాదిస్తున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక ఇలాంటి వీడియోలో ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే.. ఇంకేముంది.. వారి చానెల్ ఎక్కడికో వెళ్లి పోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ యూట్యూట్ కుకింగ్ చానెల్‌లో కనిపించడమే కాక స్వయంగా గరిటె తిప్పి.. సదరు యూట్యూబ్ చానెల్ మెంబర్స్‌తో కలిసి వారు చేసిన వంటను ఆరగించారు. ఇక వంట చేసే సమయంలో రాహుల్ ఆయా పదార్థాల పేర్లను తమిళంలో పలికేందుకు ట్రై చేయడం.. చాలా బాగా కుదిరింది అంటూ సరదాగా కామెంట్ చేస్తూ.. ఉత్సాహంగా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఇటీవల తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ.. అక్కడ బాగా ఫేమస్ అయిన ఓ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ పెరియతంబీ బృందాన్ని కలిశారు. సడెన్‌గా వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చారు. వారు చేస్తోన్న మష్‌రూమ్ (పుట్టగొడుగులు) బిర్యానీ తయారీ విధానం చూశారు. ఆ బృందంతో పాటు తాను గరిటె తిప్పారు.
(చదవండి: లెక్కల ‘అంతు’ తేల్చినవాడు)
బిర్యానీ సైడ్ డిష్ కోసం రాహుల్ రైతా తయారు చేశారు. ఇక దానికి వాడే పదార్థాలైన ఉల్లిపాయలు, పెరుగు, కల్లుప్పును తమిళంలో ఏం అంటారో తెలుసుకుని.. తిరిగి పలకడానికి ప్రయత్నించారు. ఇక బిర్యానీ వంటడం పూర్తయిన తర్వాత వారంతా అక్కడే కూర్చుని దాన్ని తిన్నారు. అనంతరం బిర్యానీ సూపర్ అంటూ వారిని తమిళంలో ప్రశంసించారు. రాహుల్‌కి, పెరియతంబీ బృందానికి మధ్య జరిగిన ఆ సంభాషణ ఆసాంతం ఆకట్టుకునేలా ఉంది. స్థానిక మహిళ ఒకరు రాహుల్‌కు, పెరియతంబి టీమ్‌కు మధ్య ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించారు. రాహుల్ ఆంగ్లంలో చెప్పింది వారికి తమిళంలో చెప్పి, వాళ్లు తమిళంలో మాట్లాడింది రాహుల్‌కు ఆంగ్లంలో వివరించి సంభాషణ కొనసాగించారు. ఈ క్రమంలో ఒకసారి ఆమె రాహుల్ ఇంగ్లిష్‌లో చెప్పిన మాటలను వారికి మళ్లీ అదే భాషలో చెప్పడం వీడియోలో నవ్వులు పూయిస్తుంది.
(చదవండి: తమిళులపై మోదీ సవతి ప్రేమ )
తమ వంటలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని ఈ బృందానికి చెందిన సుబ్రహ్మణ్యం రాహుల్ గాంధీకి తెలిపాడు. తమిళనాడు మాత్రమే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలు, ఇతర దేశాలకు కూడా వెళ్లి వంటలు చేయాలనేది తమ కోరిక అని చెప్పాడు. అంతేకాక తమ చానెల్ ద్వారా తాము డబ్బు సంపాదించడమే కాక మరో నలుగురికి ఉపాధి కల్పించడమే తమ ధ్యేయం అన్నారు. అది విన్ని రాహుల్.. అమెరికాలో తనకొక మిత్రుడు ఉన్నాడని, ఆయనకు చెప్పి షికాగోలో వంట కార్యక్రమం పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆ మిత్రుడు ఎవరో కాదు.. శ్యామ్ పిట్రోడా. 14 నిమిషాల నిడివి గల ఈ వీడియో చివరివరకూ ఆసక్తికరంగా సాగింది. ఇక ఈ వీడియోపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment