
జైపూర్: రాజస్థాన్‌లో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం.. తన కేబినెట్‌లోని మంత్రులకు శాఖలు కేటాయించింది. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ కీలక ఎనిమిది శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. వీటిలో హోం, ఎక్సైజ్, అవినీతి నిరోధక శాఖ, కార్మిక, గృహశాఖలు ఉన్నాయి.
కీలక ఆర్థికశాఖను డిప్యూటీ సీఎం దియా కుమారికి కేటాయించారు. విద్యాధర్ నగర్ ఎమ్మెల్యే అయిన ఆమె పర్యాటకం, కళలు సాహిత్యం సాంస్కృతిక, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, మహిళా శిశు సంక్షేమశాఖ వంటి మరో అయిదు విభాగాల బాధ్యతలను స్వీకరించారు. మరో డిప్యూటీ సీఎం ప్రేమ్ చంద్ బైరవాకు టెక్నికల్- ఉన్నత విద్య, రవాణా శాఖను కేటాయించారు.
ఇతర క్యాబినెట్ మంత్రుల్లో కిరోడి లాల్ మీనాకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖలు, గజేంద్ర సింగ్ ఖిమ్సర్‌కు వైద్యారోగ్యం, రాజ్యవర్ధన్ రాథోడ్‌కు పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్.. మదన్ దిలావర్ పాఠశాల విద్యను కేటాయించారు. అయితే మంత్రులకు శాఖలను కేటాయించడంలో బీజేపీ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల తర్వాత బాధ్యతలను అప్పజెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి..
కాగా గత నవంబర్‌లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతూ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 15న రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ, డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్‌చంద్ బైర్వా ప్రమాణ స్వీకారం చేశారు. గతవారం (డిసెంబర్ 30) గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా సమక్షంలో రాజ్‌భవన్‌లో 22 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 17 మంది తొలిసారిగా మంత్రులుగా ఎన్నికైన వారు ఉన్నారు. వీరందరికీ నేడు పోర్ట్‌ఫోలియోల కేటాయింపు జరిగింది.
చదవండి: ఢిల్లీ: కన్నీరు పెట్టుకున్న స్వాతి మలివాల్
Comments
Please login to add a commentAdd a comment