సిరోహి: రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా పిండ్వారా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సిరోహి ఎస్పీ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జీపు రాంగ్ డైరెక్షన్‌లో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో జీపు ప్రయాణికులతో నిండివుంది.
జీపులో ప్రయాణిస్తున్నవారంతా పాలి జిల్లాలోని నాడోల్ ఆలయాన్ని సందర్శించి, ఇంటికి తిరిగి వస్తున్నారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కంటల్ సమీపంలోకి రాగానే ఆ జీపు ఒక ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో జీపు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు పురుషులు, ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు మృతిచెందారని పిండ్వారా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి హమీర్ సింగ్ తెలిపారు. మృతులు, గాయపడినవారు ఉదయపూర్ జిల్లాలోని గోగుండా, ఝడోల్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: నైజీరియాలో పడవ బోల్తా.. 41 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment