ప్రతీకాత్మక చిత్రం
పెళ్లైన మహిళ, మరో వ్యక్తితో కలిసి సహజీవనం చేయడం అక్రమమే అవుతుందని రాజస్థాన్ హైకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. జస్టిస్ సతీష్ కుమార్ శర్మతో కూడిన ఏకధర్మాసనం తీర్పును వెలువరించింది. అలాగే పోలీసుల భద్రత కోరుతూ ఈ జంట దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. వారికి రక్షణ పొందే అర్హత లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
మహిళకు ఇంతకముందే పెళ్లై, ఇప్పటి వరకు విడాకులు తీసుకోని నేపథ్యంలో మరో వ్యక్తితో సహజీవనం చేయడం వివాహేతర సంబంధం కిందకు వస్తుందని పేర్కొన్నారు. అలాగే పోలీసుల రక్షణ కోరుతూ వేసిన పిటిషన్‌ను తిరస్కరించారు. డేటింగ్ చేస్తున్న వారికి పోలీసుల భద్రత కల్పించడం అంటే ఇలాంటి సంబంధాలకు పరోక్షంగా అనుమతి ఇవ్వడమే అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే ఈ జంటపై ఎవరైనా దాడికి పాల్పడితే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పిటిషనర్లను ఆదేశించారు.
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. రాజస్థాన్‌లోని జున్‌జును జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళ, 27 ఏళ్ల యువకుడు సహజీనం చేస్తున్నారు. అయితే మహిళకు ఇంతకుముందే చట్టబద్ధంగా మరో వ్యక్తితో వివాహం అయ్యింది. భర్త శారీరక వేధింపులకు పాల్పడుతున్న కారణంగా ఆమె తన నుంచి విడిగా ఉంటూ ఈ యువకుడితో జీవిస్తోంది. ఈ క్రమంలో భర్త, అత్తమామలు మహిళపై నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో తమ జీవితాలకు ప్రమాదం ఉందని రక్షణ కల్పించాలని బాధిత జంట కోర్టును ఆశ్రయించింది. విచారణ సమయంలో.. మహిళ భర్త, అతని కుటుంబ సభ్యులు సైతం ఈ జంట మధ్య సంబంధాన్ని చట్ట విరుద్ధమని ఆరోపించారు.
కాగా గత జూన్‌లో జస్టిస్ నవీన్ సిన్హా,జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సహజీవనం చేస్తున్న జంటకు రక్షణ కల్పించాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది. అంతకముందు వీరి పిటిషన్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టు తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment