ఆయన చదువుకునే రోజుల్లో తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం ఫిజిక్స్ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. నేడు దేశ రక్షణమంత్రిగా ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనే రాజ్‌నాథ్ సింగ్.
దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పుట్టినరోజు నేడు. ఆయన 1951 జూలై 10న యూపీలోని చందౌలీలోని చకియాలో జన్మించారు. బీజేపీకి చెందిన సీనియర్ నేతలలో ఒకనిగా గుర్తింపు పొందారు. అయితే రాజ్‌నాథ్ సింగ్ అధ్యాపకునిగా తన కెరీర్ ప్రారంభించారనే సంగతి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రాజ్‌నాథ్ సింగ్ రైతు కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పేరు రాంబదన్ సింగ్. తల్లి పేరు గుజరాతీ దేవి. రాజ్‌నాథ్ తన ప్రారంభ విద్యను గ్రామంలోనే అభ్యసించారు. అనంతరం గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో ఎంఎస్‌సీ పూర్తి చేశారు.
రాజ్‌నాథ్ సింగ్ తొలుత యూపీలోని మీర్జాపూర్‌లోని కేబీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో ఫిజిక్స్‌లో లెక్చరర్‌గా చేరారు. మొదటి నుండి చాలా తెలివైన విద్యార్థిగా పేరొందిన ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యనిర్వాహకునిగానూ పనిచేశారు. 1974లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1977లో యూపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1988లో ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎమ్మెల్సీగా ఎన్నికై 1991లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యూపీలో విద్యా మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కాపీయింగ్ నిరోధక చట్టాన్ని, వేద గణితాన్ని ప్రవేశపెట్టారు.
రాజ్‌నాథ్ సింగ్ 1994లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1999, నవంబరు 22న కేంద్ర ఉపరితల రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2000, అక్టోబర్ 28న యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. 2003, మే 24న కేంద్ర కేంద్ర వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాన్ని కూడా పర్యవేక్షించారు.
2005 డిసెంబర్ 31న రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యారు. 2009 డిసెంబర్ 19 వరకు ఈ పదవిలో కొనసాగారు. 2009లో ఘజియాబాద్ నార్త్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014, మే 26న ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 మే 30 వరకు కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. అనంతరం రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించడంతో ఆయన మరోమారు రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment