
సాక్షి, బెంగళూరు: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీల సీడీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చట్టబద్ధమా అనే విషయంపై హైకోర్టు పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఈ కేసులో బాధిత యువతి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు సీజే జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ ఎన్‌ఎస్ సంజయ్ గౌడల ధర్మాసనం విచారించింది. సిట్ విచారణ కొనసాగింపుపై తాము పరిశీలన చేయాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది.
సిట్ చీఫ్, అదనపు పోలీసు కమిషనర్ సౌమేందు ముఖర్జీ గత మే నెల 1 నుంచి సెలవులో ఉన్నారని, ఆయన గైర్హాజరీలో జరిగిన సిట్ విచారణ చట్టబద్ధమా కాదా అనే విషయం పరిశీలించాల్సి ఉందని వెల్లడించింది. ఆయన లేకుండానే దర్యాప్తు కొనసాగిస్తారా, దీనిపై సమాధానం ఇవ్వాలని సిట్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో తుది నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 12కు వాయిదా వేసింది.
కోతుల బెడదపై హైకోర్టు ఆగ్రహం
బనశంకరి: ఐటీ సిటీలో సుమారు లక్షకు పైగా కోతులు ఉన్నాయని అంచనా. ఇవి ఇళ్లు, అపార్టుమెంట్లలో దూరి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పలువురు హైకోర్టులో కేసులు వేయగా, కోర్టు కూడా బీబీఎంపీకి అక్షింతలు వేసింది. మంగళవారం మరో అర్జీని విచారించిన హైకోర్టు, బీబీఎంపీకి చీవాట్లు పెట్టి కోతుల గోలను అరికట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నగర శివార్లలో కోతుల ఉద్యానాన్ని నిర్మించి మొత్తం వానరాలను పట్టి అక్కడకు తరలించాలని బీబీఎంపీ యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment