కేంద్ర మంత్రి రతన్‌లాల్ కటారియా
సాక్షి, న్యూఢిల్లీ: మత్తుపదార్ధాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా చిన్నారులను వాటి నుంచి దూరం చేయలేకపోతున్నారనడానికి దేశంలో 30 లక్షల మంది మైనర్లు మద్యానికి బానిసయ్యారనే విషయమే నిదర్శనం. నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్ (ఎన్‌డీడీటీసీ), ఎయిమ్స్, ఢిల్లీల ఆధ్వర్యంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ నిర్వహించిన జాతీయ స్థాయి సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా అడిగిన ప్రశ్నకు బుధవారం రాజ్యసభలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత సహాయమంత్రి రతన్‌లాల్ కటారియా పలు అంశాలు వెల్లడించారు. దేశంలో 30 లక్షల మంది మైనర్లు మద్యం బానిసలేనని తెలిపారు.
తొలిసారిగా 2017–18లో మత్తుపదార్ధాల వినియోగంపై సర్వే నిర్వహించామని ఆయా వివరాలు 2019లో ప్రచురించామని తెలిపారు. ప్రజలను మద్యం బానిస నుంచి విముక్తి చేయడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేశామని తెలిపారు. జువైనల్ హోమ్స్‌లో డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మత్తుపదార్ధాలకు బానిసలైన చిన్నారులను ఒక సమూహంగా ఏర్పాటు చేసి వారిని సంరక్షించాలని సూచించామన్నారు. దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లో నషాముక్త్ భారత్ అభియాన్ పేరిట అవగాహన కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. 10 నుంచి 18 ఏళ్ల మధ్య చిన్నారులను గుర్తించి వారికి అవగాహనతోపాటు ఇతరత్రా నైపుణ్య కార్యక్రమాల్లో భాగస్తులను చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి కటారియా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment