ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఎక్కడో దూరాన ఉంటూ, ఈ వార్త విని తల్లడిల్లిపోతున్నవారి సంగతి అలా ఉంచితే, అక్కడే ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారి మనోభావాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం ఎవరికైనా కష్టమే. రైలు ప్రమాద క్షతగాత్రులకు సహాయం అందించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్న యువకులు మీడియాతో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రాంతంలో తాము ఎక్కడ కాలు మోపినా మాంసపు ముద్దలు, తెగిపడిన అవయవాలు కనిపిస్తున్నాయన్నారు. కొందరు క్షతగాత్రులు తమ ప్రాణాలు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారని తెలిపారు.
ఇలాంటి అరుపులు విన్నవెంటనే తాము పరిగెత్తుకుంటూ వెళ్లి బాధితులకు సాయం అందిస్తున్నామన్నారు. అలాగే కొన్ని వందల మృతదేహాలను వెలికితీశామన్నారు. బాధితులు వీరిని రియల్ హీరోలుగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి రియల్ హీరోలలో ఒకరైన 38 ఏళ్ల తుకన్ దాస్ మాట్లాడుతూ తాను ఇక్కడకు ఒక మందిరం నిర్మాణ పనుల నిమిత్తం వచ్చానని, రైలు ప్రమాదం జరిగిందని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చి సహాయ చర్యల్లో పాల్గొంటున్నానని తెలిపారు. తాను ఒక బోగీలోకి దూరి వెళ్లి చూడగా.. 60 మృతదేహాలు కనిపించాయని, అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారని అన్నారు.
వెంటనే తాను వీలైనంతమందికి సాయం అందించానని తెలిపారు. ఇదేవిధంగా స్థానికంగా ఉంటున్న కొందరు యువకులు రైలు బోగీల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. వారు మీడియాతో మాట్లాడుతూ తాము 150కిపైగా మృతదేహాలను బయటకు తెచ్చామన్నారు. అలాగే బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా బాలాసోర్‌లో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 288 మంది మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక కార్యకలాపలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment