ఛతర్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో మూడవ తరగతి చదువుతున్న ఓ బాలిక తండ్రి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలోని ఓ పాఠ్యాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఓ లెసన్‌ను ‘లవ్ జిహాద్’గా పేర్కొంటూ, ఎన్‌సీఈఆర్‌టీపై పలు ఆరోపణలు గుప్పిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితేడాక్టర్ రాఘవ్ పాఠక్ కుమార్తె ఎన్‌సీఈఆర్‌టీ బోర్డు పాఠ్యాంశాలు బోధించే పాఠశాలలో హిందీ మీడియంలో మూడవ తరగతి చదువుతోంది. ఆ చిన్నారికి సంబంధించిన పర్యావరణ సబ్జెక్ట్‌లోని 17వ లెసన్ ‘చిట్టీ ఆయీ హై’ పేరుతో ఉంది. ఇందులో రీనా అనే అమ్మాయి తన స్నేహితుడైన అహ్మద్‌ను సెలవుల్లో అగర్తలాకు రమ్మని ఆహ్వానిస్తూ లేఖ రాస్తుంది. ఈ లేఖ చివరిలో ‘నీ రీనా’ అని రాస్తుంది. దీనిని గుర్తించిన డాక్టర్ రాఘవ్ పాఠక్ ఈ లెసన్ ‘లవ్ జిహాద్’ మాదిరిగా ఉందని ఆరోపించారు. అలాగే ఈ లేఖ లవ్ జిహాద్‌కు ఊతమిస్తుందంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయికి లేఖ రాయడం, పైగా చివరిలో ‘నీ రీనా’ అని రాయడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ లేఖను చదివిన పిల్లల మదిలో లవ్ జిహాద్‌పై ఆకర్షణ పెరుగుతుందని, భవిష్యత్తులో లవ్ జిహాద్ లాంటి ఘటనలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. లవ్ జిహాద్ లాంటి ఘటనలను అరికట్టేందుకు ఒకవైపు ప్రభుత్వం కఠిన చట్టాలు చేస్తుండగా, ఎన్‌సీఈఆర్‌టీకి చెందిన ఈ పుస్తకం లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నట్లున్నదని ఆయన ఆరోపించారు.
ఈ పుస్తకంలోని 17వ లెసన్‌లో అహ్మద్- రీమా లేఖను తక్షణం మార్చాలని లేదా తొలగించాలని తాను కోరుకుంటున్నానని, తన కుమార్తె ఈ లెసన్ చదివాక ఆమె మనసులో ఎలాంటి తప్పుడు భావన తలెత్తకూడదని భావిస్తున్నానని ఆయన అన్నారు.
ఈ విషయమై ఖజురహో పోలీసు అధికారి సునీల్ శర్మ మాట్లాడుతూ ఎన్‌సీఈఆర్‌టీ పర్యావరణ పుస్తకంలోని ఒక లెసన్ లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ వచ్చిన ఫిర్యాదును సీనియర్ అధికారులకు పంపినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది కూడా చదవండి: రైలు పట్టాలపై సిలిండర్.. బయటపడిన మరో కుట్ర
Comments
Please login to add a commentAdd a comment