కోల్‌కతా: జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఆయన అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో సంచలన విషయం బయటకు వచ్చింది.
మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అస్పత్రిలోని అనాథ శవాలను అమ్ముకునేవారని ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌కు బయోమెడికల్ వ్యర్థాలు, వైద్య సామాగ్రిని అక్రమంగా రవాణా చేసేవారని అన్నారు. 2023 వరకు ఆర్జీ కర్ హాస్పిటల్‌లో తాను పనిచేశానని అక్తర్ అలీ తెలిపారు. సందీప్ ఘోష్ చట్టవిరుద్ధ కార్యకలాపాలను రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. అంతే కాదు..ఘోష్‌పై విచారణ కమిటీలో తాను కూడా ఒక సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. అయితే మాజీ ప్రిన్సిపాల్ విచారణలో దోషిగా తేలినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు.
ఇదిలా ఉండగా.. సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కోల్‌కతా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నలుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. హత్యాచారం జరిగిన తర్వాత సందీప్ ఘోష్, బాధితురాలి వ్యక్తిగత వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ అంశంపైనా సీబీఐ కూడా సందీప్ ఘోష్‌ను విచారిస్తోంది. రేపటికల్లా ఘటనపై తమకు నివేదిక అందజేయాలని సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment