రాహుల్‌, ప్రియాంక మధ్య విబేధాలు? బీజేపీ సందేహం వెనుక ఏముంది? | Rift Between Rahul and Priyanka Gandhi Alleges BJP | Sakshi
Sakshi News home page

Uttar Pradesh: రాహుల్‌, ప్రియాంక మధ్య విబేధాలు? బీజేపీ సందేహం వెనుక ఏముంది?

Published Sat, Feb 17 2024 12:11 PM | Last Updated on Sat, Feb 17 2024 1:33 PM

Rift Between Rahul and Priyanka Gandhi Alleges BJP - Sakshi

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా శుక్రవారం ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొనలేకపోయారు. తాను యాత్రకు గైర్హాజరు కావడం వెనుక అనారోగ్యమే కారణమని, ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే ఈ ప్రయాణంలో భాగమవుతానని ప్రియాంక తెలిపారు. 

రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ యాత్ర ప్రారంభమై 34 రోజులు దాటింది. ఈ నేపధ్యంలో ప్రియాంకా గాంధీ తొలిసారిగా దీనిలో పాల్గొనబోతున్నారనే ప్రకటన వెలువడింది. అయితే ఇంతలోనే ఆమె ఈ యాత్రకు గైర్హాజరు కావడంపై బీజేపీ సందేహం వ్యక్తం చేసింది. అన్నాచెల్లెళ్ల మధ్య బేధాభిప్రాయాలే దీనికి కారణమని బీజేపీ ఆరోపించింది.

ప్రియాంక గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో చేసిన పోస్ట్‌లో తాను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని, అందుకే ఆసుపత్రిలో చేరినట్లు తెలియజేశారు. ఆమె తన పోస్ట్‌లో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఉత్తరప్రదేశ్‌కు ఎప్పుడు చేరుకుంటుందానని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అయితే అనారోగ్యం కారణంగా నేను ఈరోజే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. నా ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిన వెంటనే, నేను ఆ ప్రయాణంలో భాగమవుతాను. చందౌలీ-బనారస్‌లో జరిగే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొనబోయే నేతలకు, కార్యకర్తలకు, నా ప్రియమైన సోదరునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. 
 

మరోవైపు డీహైడ్రేషన్‌, వికారం కారణంగా కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి.  కాగా ప్రియాంక గాంధీ తన ఆరోగ్య వివరాల గురించి  చేసిన ట్వీట్‌కు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ స్పందించారు. ప్రియాంక గాంధీ పోస్ట్‌పై ఆయన వ్యాఖ్యానిస్తూ ‘ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. యాత్ర 2.0 ప్రారంభమైనప్పుడు కూడా ప్రియాంక వాద్రా కనిపించలేదు. రాహుల్ యాత్ర ఉత్తరప్రదేశ్ చేరుకున్నప్పుడు కూడా ప్రియాంక హాజరుకావడం లేదు. పార్టీ నాయకత్వం కోసం అన్నాచెల్లెళ్ల మధ్య ఏర్పడిన ఈ పూడ్చలేని అగాధం ఇప్పుడు అందరికీ తెలుస్తోంది’ అని పేర్కొన్నారు. 

‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ యాత్ర 2024, జనవరి 14న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో మణిపూర్ నుంచి ప్రారంభమైంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చి 20 లేదా 21న ముంబైలో ముగియనుంది. అయితే మార్చి మొదటి పక్షంలోనే ముంబైలో ఈ యాత్ర ముగుస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్ర శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఇది తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల గుండా వెళుతూ, ఫిబ్రవరి 16 నుండి 21 తేదీల మధ్య రాయ్‌బరేలీ అమేథీల గుండా ముందుకు వెళుతుంది. ఫిబ్రవరి 22, 23లలో యాత్రకు విశ్రాంతినివ్వనున్నారు. ఈ యాత్ర పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ఫిబ్రవరి 24, 25 తేదీలలో తిరిగి ప్రారంభం కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement