Karnataka Road Accident: Bus Hits Jeep Several Dead And Injured - Sakshi
Sakshi News home page

విహారయాత్ర విషాదాంతం

Published Fri, Jun 3 2022 11:21 AM | Last Updated on Sat, Jun 4 2022 3:34 AM

Road Accident: Bus Hits Jeep Several Dead And Injured Karnataka - Sakshi

సాక్షి, బళ్లారి/ సాక్షి, హైదరాబాద్‌/ అల్వాల్‌/గన్‌ఫౌండ్రి: వేసవి సెలవుల నేపథ్యంలో విహార యాత్రకు వెళ్లారు. ఐదు రోజులు ఉల్లాసంగా గడిపారు. తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఏడుగురు సజీవ దహనమయ్యారు. 13 మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన పలు కుటుంబాల్లో పెను విషాదం నింపిన ఈ దుర్ఘటన వివరాలు.. బాధితులు, కలబురిగి జిల్లా ఎస్పీ ఇషా పంత్, స్థానిక బంధువుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.

ఎప్పటిలాగే వేసవి టూర్‌
సికింద్రాబాద్‌ బొల్లారంలోని రిసాలబజార్‌ శాంతినగర్‌ కాలనీకి చెందిన ముకుందరావు (65) ఆర్మీలో పని చేసి పదవీ విరమణ పొందారు. ఈయన కుమారుడు అర్జున్‌ కుమార్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఈ కుటుంబం ప్రతి ఏడాది వేసవి సెలవుల నేపథ్యంలో బంధువులతో కలిసి విహార యాత్రకు వెళ్తుంటుంది.

గత ఏడాది తిరుపతికి వెళ్లి వచ్చింది. ఈసారి గోవా వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. దీంతో అర్జున్‌ సుచిత్ర జంక్షన్‌ వద్ద ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన 2+1 ఏసీ స్లీపర్‌ బస్సును బుక్‌ చేశారు. ఈ నెల 28న శాంతినగర్‌తో పాటు సమీపంలోని బంజారా విలేజ్‌ కాలనీకి చెందిన బంధువులు, నగరంలోని గోడేకీ ఖబర్‌ ప్రాంతానికి చెందిన శివకుమార్‌ (నాంపల్లి కోర్టులో అటెండర్‌) కుటుంబం.. అంతా కలిపి మొత్తం 32 మంది గోవా బయలుదేరారు. ముకుందరావు భార్య వసంత మాత్రం ఆనారోగ్య కారణాలతో ఇంట్లోనే ఉండిపోయారు. 5 రోజుల పాటు గోవాలో గడిపిన వారంతా గురువారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. 

రాంగ్‌ రూట్‌లో వచ్చిన వాహనాన్ని ఢీ కొట్టి..
ఈ బస్సుకు అమృత్, రవీంద్ర డ్రైవర్లుగా కాగా మరో క్లీనర్‌ కూడా ఉన్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఈ బస్సు బీదర్‌ – శ్రీరంగపట్టణం హైవేలోని కలబురగి (గుల్బర్గా) జిల్లా కమలాపుర ప్రాంతానికి చేరుకుంది. అప్పటివరకు డ్రైవింగ్‌ చేసిన అమృత్‌ బస్సును రవీంద్రకు అప్పగించాడు.

ఇతడు నడపటం మొదలెట్టిన కొద్ది సేపటికే ఎదురుగా రాంగ్‌ రూట్‌లో వచ్చిన టెంపో.. బస్సును ఢీ కొట్టింది. దీంతో అదుపు తప్పిన బస్సు జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టును ఢీ కొని కిందకు పడిపోయింది. ఈ ధాటికి వాహనం డీజిల్‌ ట్యాంక్‌ పగిలిపోగా... బస్సుకు మంటలు అంటుకున్నాయి. 

కళ్లముందే కాలి బూడిదయ్యారు 
గాఢ నిద్రలో ఉన్నవారు ప్రమాదంతో బస్సులోనే చెల్లాచెదురుగా పడిపోయారు. ఇంతలోనే బస్సంతా మంటలు వ్యాపించాయి. డ్రైవర్లు, క్లీనర్‌ సహా మిగతా వారంతా అక్కడి స్థానికులు, హైవేపై వెళ్తున్న ప్రయాణికుల సాయంతో కిటికీల్లోంచి బయటపడగా దట్టమైన మంటల్లో చిక్కుకున్న ఏడుగురు మాత్రం వారి కళ్లముందే కాలి బూడిదయ్యారు. తమ వారు కళ్ల ముందే కాలిపోతున్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయతతో బయటపడిన బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. పెద్ద శబ్దం వచ్చిందని, కళ్లు తెరిచి చూసేలోగా మంటల మధ్య ఉన్నామని కొందరు తెలిపారు. బస్సు కూడా పూర్తిగా తగలబడిపోయింది. గాయపడిన వారిని పోలీసులు కలబురిగి ఆస్పత్రికి తరలించారు. టెంపో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఎస్‌పీ ఇషా పంత్‌ తదితరులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. బస్సు ప్రమాదంపై కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బి.శ్రీరాములు తీవ్ర సంతాపం ప్రకటించారు. బస్సు దుర్ఘటన తమను కలచివేసిందన్నారు.

శాంతినగర్‌లో విషాదఛాయలు
ఈ ప్రమాదం విషయం శుక్రవారం సాయంత్రం వరకు ముకుందరావు భార్య వసంతకు తెలియనీయలేదు. ఆమె అనారోగ్య కారణాల నేపథ్యంలో బంధువులు గోప్యంగా ఉంచారు. ముకుందరావు ఆఖరిసారిగా గురువారం రాత్రి తన భార్యతో మాట్లాడి శుక్రవారం మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తామంటూ చెప్పారు. ప్రమాద నేపథ్యంలో శాంతినగర్‌ కాలనీలోని ముకుందరావు ఇంటికి చేరుకున్న బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కలబురిగిలో ఏం జరిగిందో, క్షతగాత్రుల పరిస్థితి తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కొందరు బంధువులు కలబురగి బయలుదేరి వెళ్లారు. వారు మృతులను గుర్తించినట్టు తెలిసింది. ముకుందరావు ఇంటికి వెళ్లిన మంత్రి తలసాని, ఎమ్మెల్యే సాయన్న మృతుల బంధువులను పరామర్శించారు.

గోవా వెళ్లింది వీరే..
ముకుందరావు, అర్జున్‌కుమార్, సరళాదేవి, దేవాన్‌‡్ష, మానసి, అర్చన, జయశ్రీ, ఖుషీ, కె.స్నేహలత, కవిత, కల్పన, విశాల్, రాజేశ్వర్, విరాన్, కె.రఘు, కె.విజయలక్ష్మి, జయంత్, నీలేష్, ఎస్‌.సుధ, కె.గగన్‌ దీప్, అర్చన, అనిత, శివకుమార్, లావణ్య, దీక్షిత్, అధ్వైత్, దీప్తి, దివాన్‌‡్ష, సుధీర్‌ కుమార్‌లతో పాటు మరో ముగ్గురు (వీరితో పాటు ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌ బస్సులో ఉన్నారు)

మృతులు ..: అర్జున్‌కుమార్‌ (36), అతని భార్య సరళాదేవి (34), కుమారుడు వివాన్‌ (3), ముకుందరావు సోదరి అనిత (58), గోడేకా ఖబర్‌ ప్రాంతానికి చెందిన అనిత కుమార్తె రవళి (30), అల్లుడు శివకుమార్‌ (35) వీరి పెద్ద కుమారుడు దీక్షిత్‌ (11)క్షతగాత్రులు..: ముకుందరావు (65), అర్జున్‌ కుమార్తె ఖుషి (8), ముకుందరావు సమీప బంధువు మానస (18), అనిత భర్త రవీందర్‌ తదితరులు.

ప్రధాని సంతాపం
కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 
చదవండి: Money Bags In Beggar Room: యాచకుడి మృతి.. సంచుల నిండా నోట్లు చూసి మైండ్‌ బ్లాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement