సాక్షి, హైదరాబాద్: నవంబరు 14 అనగానే చిన్నారులకు ఇష్టమైన పండుగ బాలల దినోత్సవం గుర్తుకొస్తుంది. చేతిలో జెండాలు, గుండెలమీద గులాబీలతో ఉత్సాహం ఉరకలు వేసే చిన్నారులు మన కళ్ల ముందు కదలాడతారు. మరోవైపు గనుల్లో, కార్ఖానాల్లో, ఇటుకబట్టీల్లో, గొడ్ల సావిళ్లలో, టీ దుకాణాల్లో మగ్గిపోతున్న బాల్యం. 75 వసంతాల అమృత మహోత్సవాల వేళ కనీస చదువుకు దూరమై, కట్టుబానిసల్లా బతుకులీడుస్తున్న దైన్యం. మరి వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న భావి భారతానికి నిజమైన బాలల పండుగ ఎపుడు? ఇపుడిదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు నాడు బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా ప్రత్యేకగా వేడుకలు నిర్వహించు కుంటాం. పిల్లలు స్వాత్రంత్య సమరయోధుల వేషధారణలో తమను తాము చూసుకొని మురిసిపోతారు. భావి భారతంకోసం ఎన్నో కలల్లో మునిగిపోతారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడిచిన ఈ శుభవేళ రేపటి పౌరులు కనీస సౌకర్యాలు కూడా లేకుండా దారిద్ర్యంలో మగ్గిపోతున్న వారు చాలామంది ఉన్నారు. మిలియన్లకొద్దీ బాలల భవిష్యత్‌ను కాలరాస్తున్న బాల కార్మిక వ్యవస్థ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బడిలో ఉండాల్సిన బాల భారతం వెట్టి చాకిరీలో మగ్గిపోతోంది. ఇక నైనా వారి జీవితాల్లో మార్పు రావాలని, వెలుగులు నిండాలని కోరుకుంటూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
Comments
Please login to add a commentAdd a comment