నీట్ రద్దుకు సుప్రీం నిరాక‌ర‌ణ‌.. ఎన్‌టీఏకు నోటీసులు | NEET Results Row: Supreme Court Says Sanctity Of Exam Affected, Need Answers | Sakshi
Sakshi News home page

NEET-UG: నీట్ పరీక్ష‌ రద్దుకు సుప్రీం నిరాక‌ర‌ణ‌.. ఎన్‌టీఏకు నోటీసులు

Published Tue, Jun 11 2024 1:30 PM | Last Updated on Tue, Jun 11 2024 1:44 PM

Sanctity Of Exam Affected Need Answer : Supreme Court On NEET UG Row

న్యూఢిల్లీ:  వైద్య విద్య‌లో  ప్రవేశాల కోసం నిర్వ‌హించే నేష‌న‌ల్ ఎంట్ర‌న్స్ క‌మ్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ అండ‌ర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ) పరీక్ష‌ను ర‌ద్దు చేయాటలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. దీనిపై జస్టిన్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అమనుల్లాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ జరిపింది.

మే 5న జ‌రిగిన నీట్ యూజీ ప‌రీక్ష పేప‌ర్ లీకేజీ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న్లు కోరుతున్నార‌ని.. దీనిపై స‌మాధానం చెప్పాలంటూ కేంద్ర ప్ర‌భుత్వంతోపాటు ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన నేష‌నల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే నీట్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయ‌డం అంత సులువు కాద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అభిప్రాయ‌ప‌డింది.

విచార‌ణ సంద‌ర్బంగా సుప్రీం ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ‘ఇది మీరు అనుకున్నంత సులభం కాదు. ఇది ప‌విత్ర‌మైన‌ది. అలా చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం, పవితత్ర దెబ్బతింటుంది. అందువల్ల ఈ ఆరోపణలపై మాకు సమాధానాలు కావాలి. ఎప్పటిలోగా సమాధానం చెబుతారు? కాలేజీల రీఓపెనింగ్ జరిగిన వెంటనే చెబుతారా? లేదంటే ఈలోగా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ మొదలవుతుంది’ అని ఎన్‌టీఏ న్యాయ‌వాదిని ఉద్ధేశించి జస్టిస్ అమానుల్లా పేర్కొన్నారు. దీనిపై స్పందన తెలియజేయాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి నోటీసులు జారీ చేశారు.

ఇక ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కౌన్సిలింగ్‌ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఆలోగా ఎన్‌టీఏ తమ సమాధానం తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.

దీనికి ఎన్ టీఏ తరఫు అడ్వొకేట్ స్పందిస్తూ ఇప్పటికే దాఖలైన మరో కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారిస్తోందని.. మే 17న తమకు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఆ కేసు విచారణ జులై 8కి వాయిదా పడినందున ఈ కేసును కూడా అదే కేసుకు జత చేయాలని కోరారు. అనంతరం దీనిపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది.

కాగా  వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ - 2024 పరీక్షలో అవతవకలు జరిగినట్లు గత కొన్ని రోజులుగా ఆరోపణలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. జూన్ 4న వెలువ‌డిన‌ ఈ ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆలిండియా మొదటి ర్యాంక్‌ రాగా, వారిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది.

దీంతో పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు వస్తున్నందున పరీక్షను రద్దు చేసి తిరిగి కొత్త‌గా నిర్వహించేలా డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్ర‌మంలో ఆరోపణలపై విచారణకు యూపీఎస్సీ మాజీ ఛైర్మన్‌ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement