న్యూఢిల్లీ: ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్)ల మధ్య సీట్ల పంపిణీ ఖాయమైంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం కూడా పూర్తయిందని ఆ పార్టీ నేతలు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పొత్తులో భాగంగా ఢిల్లీలోని 7 సీట్లలో నాలుగింటిలో ఆప్, మూడింటిలో కాంగ్రెస్ పోటీ చేయనుంది.
న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, తూర్పు ఢిల్లీల్లో ఆప్ పోటీ చేయనుండగా చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. 2014,2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా బీజేపీ ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లను కైవసం చేసుకోవడం విశేషం. కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కొన్ని సీట్లను ఆప్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది.
ఇందులో భాగంగా హర్యానాలో ఒకటి, గుజరాత్‌లో రెండు సీట్ల నుంచి కూడా పొత్తులో భాగంగా ఆప్‌కు కాంగ్రెస్ ఆఫర్ చేసింది. ఈ వారంలోనే ఇండియా కూటమిలోని మరో ప్రధాన పార్టీ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో కాంగ్రెస్ సీట్ల పంపకం ఖరారైన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా యూపీలో ఎస్పీ 63, కాంగ్రెస్ 17 చోట్ల పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కూటమిలోని మరో పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ మాత్రం పశ్చిమబెంగాల్‌లోని మొత్తం 42 సీట్లలో తామే పోటీ చేస్తామని చెబుతుండడం ఇండియా కూటమి నేతలను కలవరానికి గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment