ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను పెద్ద మొత్తంలో తయారు చేసేందుకు ఆస్ట్రాజెనెకా, భారత్‌లోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మధ్య ఒక ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. కనీసం 100 కోట్ల డోసుల టీకా తయారీకి సీరమ్ ఇన్ స్టిట్యూట్ సిద్ధమవుతోంది కూడా. అంతేకాదు.. కచ్చితంగా ఇంకో 66 రోజుల్లో కోవిషీల్డ్ అందరికీ అందుబాటులోకి వస్తుందని, 130 కోట్ల భారతీయుల కోసం కనీసం 68 కోట్ల డోసులను వచ్చే ఏడాది జూన్ నాటికి సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఒకవైపు టీకా ప్రయోగాలు ఇంకా రెండో దశలోనే ఉండగా.. విస్తృత స్థాయిలో నిర్వహించాల్సిన మూడోదశను కూడా దాటుకుని 66 రోజుల్లో అందుబాటులోకి రావడం సాధ్యమేనా? జరుగుతున్న పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే అసాధ్యమేమీ కాదన్న సమాధానం వస్తోంది. ఎందుకంటే సరిగ్గా వారం క్రితమే కోవిషీల్డ్ రెండవ/మూడవ దశ ప్రయోగాలు మొదలయ్యాయి. పుణేలోని ఓ ఆసుపత్రిలో ఏడుగురికి టీకా అందించారు.
(చదవండి : 36 లక్షలు దాటిన టెస్టులు)
టీకా అందుకున్న వారిలో ఓ గైనకాలజిస్టు కూడా ఉన్నారు. రానున్న రోజుల్లో మరింత మందికి రెండో దశలో భాగంగా టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. టీకా తొలి డోసు అందుకున్న వారికి 29 రోజుల తరువాత రెండో దఫా టీకా ఇస్తారు. దేశం మొత్తమ్మీద 17 కేంద్రాల్లో 1,600 మందికి ఈ టీకా అందిస్తారు. ఇంకోలా చెప్పాలంటే 58 రోజుల్లో ప్రయోగాలన్నీ ముగించి.. మరో 15 రోజుల సమయంలో సమాచారాన్ని క్రోడీకరించాలన్నది సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆలోచన. ప్రయోగాల సమయంలో పాటించాల్సిన పద్ధతులు కొన్నింటినీ తగ్గించడం, వేగవంతం చేయడం, వాణిజ్య ఉత్పత్తి చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే సీరమ్ ఇన్ స్టిట్యూట్‌కు ప్రత్యేక లైసెన్సు జారీ చేసింది. (చదవండి : వ్యాక్సిన్ రేస్.. అందరికీ టీకా.. ఎందాక?)
ఈ లెక్కన చూస్తే 66 రోజులకు టీకా వాణిజ్యస్థాయి ఉత్పత్తి మొదలవుతుందని అంచనా. భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇటీవల మాట్లాడుతూ.. భారత్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లలో ఒకటి మూడో దశ మానవ ప్రయోగాలు జరుపుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. సాధారణ పరిస్థితుల్లో మూడవ దశ టీకా ప్రయోగాలకు కనీసం ఏడెనిమిది నెలల సమయం అవసరం కాగా.. కోవిషీల్డ్ విషయంలో ఈ సమయాన్ని గణనీయంగా కుదించారన్నమాట. అయితే కోవిషీల్డ్ 66 రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్న మీడియా వార్తలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని సీరమ్ ఇన్ స్టిట్యూట్ అంటోంది. టీకా అందుకున్న వారిలో ఏ రకమైన దుష్ఫలితాలు కనిపించకపోతే తొందరగా మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశం లేకపోలేదన్నది నిపుణుల మాట. ప్రస్తుతానికైతే అలాంటి ప్రమాదమేమీ కనిపించకపోవడం అందరికీ ఊరటనిచ్చే అంశం. దేశ జనాభా 130 కోట్లలో కనీసం 68 కోట్ల డోసులు సీరమ్ ఇన్ స్టిట్యూట్ నుంచి సేకరించాలని, మిగిలినవి భారత్ బయోటెక్, జైడస్ కాడిల్లా ప్రయోగాలు విజయవంతమైతే వారి నుంచి సేకరించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment