ప్రపంచమిప్పుడు కాలంతో పోటీపడుతోంది... ఉరుకులు పరుగులతో కరోనా కట్టడికి టీకాను అభివృద్ధి చేస్తోంది.దశాబ్దాల సమయాన్ని నెలల్లోకి కుదించేస్తోంది!. ప్రయోగ ఫలితాలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూన్న వేళ...టీకా అందరికీ అందుబాటులోకి వచ్చేదెలా?. పంపిణీలో సమస్యలు అధిగమించగలమా?. టీకా పరిశోధనలు మనకు నేర్పే పాఠాలేమిటి?. వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు.
చైనాలోని వూహాన్‌లో పుట్టి ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్ అంతానికి రంగం సిద్ధమైంది. ఒకటి కాదు.. రెండు కాదు.. కనీసం నాలుగైదు టీకాలు దాదాపుగా అందుబాటులోకి వచ్చేశాయి. కానీ 730 కోట్ల జనాభాకు టీకా సిద్ధం చేయడం సవాలే. కలిసికట్టుగా పని చేస్తేనే సాధ్యం. టీకా పంపిణీ, తారతమ్యాల్లేకుండా అందరికీ టీకా వేయించడం కీలకం. ప్రస్తుతం కనీసం 180 వ్యాక్సీన్ ప్రయోగాలు వివిధ దశల్లో ఉండగా తొమ్మిది మాత్రమే తొలి రెండు దశల మానవ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. చైనా, రష్యాలు ఒక్కో టీకా వాడకానికి పరిమితమైన అనుమతులు ఇచ్చాయి కూడా. స్థూలంగా చూస్తే... ఇప్పటికైతే కరోనా టీకా ఏదీ అందుబాటులో లేనట్లే. ప్రీక్లినికల్ ట్రయల్స్‌తో కలుపుకుని ఒక్కో టీకా అభివృద్ధికి గతంలో 10 – 12 ఏళ్ల సమయం పట్టేది. కానీ కొన్ని దశలను కలిపేసి నిర్వహించడం, ప్రభుత్వాలు వేగంగా అనుమతులు జారీ చేయడం వంటి అనేక చర్యల వల్ల కోవిడ్ టీకా ఏడాది లోపే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
తయారీ సవాలు!
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ టీకా మానవ ప్రయోగాల్లో మూడోదశలోనే ఉన్నప్పటికీ భారత్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీటి తయారీకి ప్రయత్నిస్తోంది. మానవ ప్రయోగ ఫలితాలు మొత్తం అందుబాటులోకి వచ్చేవరకూ వేచి చూడరాదని, శాస్త్రవేత్తలు, నియంత్రణ సంస్థలు పరిశ్రమలు పరస్పర సహకారం తో ముందుకు సాగితేనే సకాలంలో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని కొంతమంది నిపుణుల అభిప్రాయం. భారత్ లాంటి దేశాలకు మాత్రమే టీకాలను భారీ స్థాయిలో తయారు చేయగల సామర్థ్యం ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అభిప్రాయపడటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. తయారీ విషయం ఇలా ఉంటే ప్రపంచం నలుమూలలకు టీకాను పంపిణీ చేయడం ఇంకో సవాలుగా నిలుస్తుంది. వ్యాక్సీన్ తయారీదారుల సమాఖ్య (గావి) ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పలు దేశాల్లోని కంపెనీలతో కలిసి కరోనా టీకా అన్నిచోట్ల ఏకకాలంలో తయారయ్యేలా చూసేందుకు ప్రయత్నిస్తోంది. యూపీఎస్ వంటి కొరియర్ సంస్థల సాయంతో వ్యాక్సీన్ అందరికీ అందేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అవసరమైతే డ్రోన్ల సాయంతోనూ టీకా పంపిణీ చేపడతామని గావి చెబుతూండటం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవ్యాక్స్ పేరుతో ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫార్మ్ పేద దేశాలకు టీకా అందించే ఏర్పాటు చేస్తోంది.
కోవిడ్ నేర్పిన పాఠాలెన్నో...
కోవిడ్–19 ప్రపంచానికి నేర్పిన పాఠాలు ఎన్నో. అత్యవసర పరిస్థితులను అధిగమించేందుకు పరస్పర సహకారం ఒక్కటే మార్గం అన్నది ఇందులో ఒకటి. దశాబ్దాల సమయం పట్టే టీకా తయారీ ప్రక్రియను నెలల స్థాయికి కుదించగలగడం సహకారం వల్ల మాత్రమే సాధ్యమైందని ఇప్పటికే పలువురు నిపుణులు ప్రకటించారు కూడా. కరోనా తర్వాత కూడా ఈ సహకారం వైద్యపరిశోధనలను కొత్త పుంతలు తొక్కిస్తుందని, వ్యాధుల నుంచి రక్షించే టీకా అభివృద్ధి ప్రక్రియలో సమూలమైన మార్పులకు కారణమవుతుందని అంచనా. నిన్న మొన్నటివరకూ నిర్వీర్యమైన, లేదా బలహీన పరిచిన వైరస్‌ల ఆధారంగానే కొత్త టీకాలు తయారవుతూండగా.. కోవిడ్ –19 పుణ్యమా అని ఇకపై జన్యు ఆధారిత టీకా తయారీ ఊపందుకునే అవకాశం ఏర్పడింది. డీఎన్‌ఏ, ఎంఆర్‌ఎన్‌ఏలతో తయారయ్యే టీకాలతో దుష్పభ్రావాలు తక్కువన్నది తెలిసిందే. అంతేకాదు.. టీకా తయారీ చాలా వేగంగా జరిగిపోతుంది. ఖర్చు కూడా తక్కువే. తయారీ వేగమూ ఎక్కువే కావడం గమనార్హం.
టీకా కహానీ !
ప్రపంచ ఆరోగ్య రంగాన్ని మలుపు తిప్పిన కొన్ని పరిణామాల్లో టీకాలు ఒకటన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆటలమ్మ మొదలుకొని కోరింత దగ్గు, పోలియో వంటి అనేక ప్రాణాంక వ్యాధులకు చెక్ పెట్టేందుకు, నవజాత శిశు మరణాలను తగ్గించేందుకూ ఈ టీకాలే కీలకమయ్యాయి. 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్‌ను తయారు చేశారని చరిత్ర చెబుతోంది. అంతకంటే ముందు ఇదే వ్యాధి చికిత్స కోసమని చైనాలో ఓ వింత పద్ధతిని అనుసరించారు. స్మాల్‌పాక్స్ పొక్కులను పొడిచేసి ముక్కుల్లోకి చొప్పించే ఈ పద్ధతిని వైరొలేషన్ అని పిలిచేవారు. పశువుల కాపరులకు స్మాల్‌పాక్స్ సోకకపోవడాన్ని గుర్తించిన జెన్నర్ ఆవుల్లోని వైరస్ ఆధారంగా టీకాను సిద్ధం చేశారు. పాలమ్మాయి చేతులపై ఉన్న గాయాల నుంచి కొంత రసిని సేకరించి ఎనిమిదేళ్ల బాధితుడి చేతిపై చేసిన గాటులోకి వేయడం తొలి టీకా అయ్యింది. ఆరు వారాల తరువాత ఆ అబ్బాయికి స్మాల్‌పాక్స్ వైరస్ ఎక్కించినా వ్యాధి సోకలేదు. ఆవుతో సంబంధం ఉన్న కారణంగా లాటిన్ భాషలో ఆవును వాకా అని పిలుస్తారు కాబట్టి టీకా వేయడమే ప్రక్రియకు వ్యాక్సినేషన్ అన్న పేరు వచ్చింది. 1885లో లూయిస్ పాశ్చర్ ర్యాబిస్ వ్యాధికి టీకా అభివృద్ధి చేయడంతో ఆధునిక ప్రపంచంలో టీకాల వాడకం ఊపందుకుందని చెప్పుకోవచ్చు. 1914లో వూఫింగ్ కాఫ్‌కు టీకా తయారైన తరువాత 1969 నాటికల్లా ఎనిమిది టీకాల అభివృద్ధికి దారితీసింది.
టీకా ఎన్నిరకాలు..
బ్యాక్టీరియా, వైరస్, వంటి సూక్ష్మజీవుల నుంచి రక్షణకు ఉపయోగపడే టీకాలను స్థూలంగా నాలుగు రకాలు. డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ ఆధారంగా సిద్ధమయ్యేవి తొలి రకం. సూక్ష్మజీవి సాయంతో జన్యుపదార్థాన్ని పంపించి రోగ నిరోధక వ్యవస్థ స్పందించేలా చేసేది రెండో రకం. కరోనా వైరస్ ప్రొటీన్లను ఉత్పత్తి చేసి వాటి ఆధారంగా మన రోగ నిరోధక వ్యవస్థ... హానికారక వైరస్‌లను గుర్తించేలా చేయడం మూడో రకం. నిర్వీర్యం చేసిన లేదా బలహీనపరిచిన వైరస్‌ల ఆధారంగా తయారయ్యేవి నాలుగో రకం. భారత్‌కు చెందిన జైడస్ క్యాడిల్లా డీఎన్‌ఏ, ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత టీకాలు తయారు చేస్తోంది. రష్యా తయారు చేసిన స్పుత్నిక్ –వీ రెండు అడినోవైరస్‌ల సాయంతో టీకాను అభివృద్ధి చేసింది. చైనా కంపెనీ అన్‌హుయి ఝీఫే లాంగ్‌కామ్, నోవావ్యాక్స్ (అమెరికా), మెడికాగో (కెనడా)లు ప్రొటీన్ ఆధారిత టీకా తయారీ ప్రయత్నాల్లో ఉన్నాయి. మెడికాగో, కెంటకీ బయోప్రాసెసింగ్ కంపెనీలు పొగాకు ఆధారంగా టీకాను అభివృద్ధి చేస్తూండటం విశేషం. నిర్వీర్యం చేసిన వైరస్‌తో అభివృద్ధి చేసిన టీకాపై సైనోవ్యాక్ బయోటెక్ బ్రెజిల్, ఇండొనేసియాల్లో మూడోదశ ప్రయోగాలు జరుపుతోంది. ఐసీఎంఆర్/భారత్ బయోటెక్, మెర్క్ (అమెరికా) లు కూడా నిర్వీర్యమైన వైరస్‌ల సాయంతో కరోనా కట్టడికి టీకాను తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి.
టీకా పరీక్షలు.. దశలు...
ప్రీ క్లినికల్
కణాలు, ఎలుకలు, కోతుల్లాంటి జంతువులపై టీకా ప్రయోగిస్తారు. ఇప్పటివరకూ సుమారు 142 టీకాలు ఈ దశలో ఉన్నాయి.
తొలి దశ
ఎంపిక చేసిన కొంతమందికి టీకా ఇస్తారు. మోతాదు, దువాలు, రోగ నిరోధక వ్యవస్థ స్పందనలను పరిశీలిస్తారు. ప్రస్తుతం 27 టీకాలు ఈ దశను దాటాయి. ఒకట్రెండేళ్లు పట్టే తొలిదశ ప్రయోగాలను కోవిడ్ కోసం మూడు నెలలకు కుదించారు.
రెండో దశ
వందల మందికి టీకాలు ఇస్తారు. పిల్లలు, వయోవృద్ధులు ఇతరులందరినీ గుంపులుగా విడదీసి ప్రయోగాలు జరుగుతాయి. ఏ గుంపులోనైనా టీకా భిన్నంగా వ్యవహరిస్తోందా? అన్నది గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. సురక్షితమేనా? రోగ నిరోధక వ్యవస్థ స్పందిస్తోందా?... లాంటి అంశాలను ధ్రువీకరించుకునేందుకూ ఈ దశ ఉపయుక్తం. సుమారు 15 టీకాలు రెండో దశ ప్రయోగాలు జరుపుకుంటున్నాయి. రెండు నుంచి మూడేళ్లు పట్టే రెండో దశ ప్రయోగాలు ఎనిమిది నెలల్లో పూర్తి చేశారు.
మూడో దశ
వేర్వేరు ప్రాంతాల్లో ఉండే కొన్ని వేల మందిని ఎంపిక చేసి టీకాలు ఇస్తారు. టీకా తీసుకున్న వారిలో కనీసం 50 శాతం మందికి రక్షణ లభిస్తే ఈ దశ విజయవంతమైనట్లుగా పరిగణిస్తారు. పదకొండు టీకాలు ప్రస్తుతం ఈ దశలో ఉన్నాయి. సాధారణంగా 2 – 4 ఏళ్లు పడుతుంది. కోవిడ్ విషయంలో ఈ సమయాన్ని కొన్ని నెలలకు కుదించారు.
పరిమిత అనుమతులు
మూడో దశ ఫలితాల కోసం వేచి చూడకుండానే టీకా వాడకానికి పచ్చజెండా ఊపడం పరిమితమైన అనుమతి కింద పరిగణించాలి. ప్రస్తుతం చైనా, రష్యాలతోపాటు దాదాపు 5 టీకాలకు ఈ అనుమతి లభించింది. ఫలితాల సమగ్ర సమీక్ష లేకుండానే టీకాను ఉపయోగించడం ప్రమాదకరమని నిపుణుల అభిప్రాయం. కోవిడ్ కోసం ఒకట్రెండేళ్లు పట్టే ఈ సమయాన్ని నెలల్లోనే పూర్తి చేస్తున్నారు.
అనుమతులు
ఆయా దేశాల్లోని నియంత్రణ సంస్థలు ప్రయోగాల వివరాలను పూర్తిగా విశ్లేషించి టీకా వాడకంపై నిర్ణయం తీసుకుంటాయి. టీకా వాడకానికి లైసెన్స్ ఇచ్చిన తరువాత తీసుకున్న వారిని దీర్ఘకాలంపాటు పరిశీలిస్తూంటారు.
ప్రయోగ దశలు కలిపేయడం
అత్యవసర పరిస్థితుల్లో టీకా ప్రయోగాల్లోని వేర్వేరు దశలను కలిపి నిర్వహించేందుకూ అవకాశం ఉంటుంది. కరోనా వైరస్ విషయాన్నే తీసుకుంటే కొన్ని కంపెనీలు తొలి రెండు దశలను కలిపి చేపడుతూంటే మరికొన్ని రెండు, మూడో దశలను కలిపేసి నిర్వహిస్తున్నాయి.
టీకాలు సురక్షితమేనా?
ఇప్పటివరకూ కొన్ని కోట్ల మంది టీకాలు వేయించుకుంటే.. తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించింది అతి తక్కువ మందిలోనే.
టీకాలతో దుష్ప్రభావాలు ఉంటాయా?
జ్వరం, చేతినొప్పి వంటి తాత్కాలిక దుష్ప్రభావాలు మాత్రమే. ప్రమాదకరమైన ప్రభావాలూ చాలా అరుదు.
కోవిడ్ –19 టీకా ప్రయోగాల్లో పాల్గొనేందుకు ఏం చేయాలి?
ప్రయోగాలు నిర్వహిస్తున్న ఆసుపత్రి లేదా టీకా తయారు చేస్తున్న కంపెనీని సంప్రదించడమే. ఆరోగ్య పరీక్షల తరువాత టీకా ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు.
టీకా తయారీ, ప్రయోగాల ఖర్చులు భరించేదెవరు?
టీకా తయారు చేస్తున్న కంపెనీ. కోవిడ్ కోసం కోవాగ్జిన్ పేరుతో టీకాను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ ప్రయోగాల్లో పాల్గొనే వారందరికీ జీవిత బీమా సౌకర్యం కూడా కల్పిస్తోంది.
ఎవరు పాల్గొనవచ్చు?
టీకాను బట్టి అర్హత ప్రమాణాలు మారుతూంటాయి.
టీకా ఎన్నిసార్లు వేసుకోవాలి?
టీకాను బట్టి ఉంటుంది. కొన్ని ఒకట్రెండేళ్లు రక్షణ కల్పిస్తాయి. కరోనా వైరస్ జన్యుక్రమ మార్పులు
టీకాపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 రకాల వైరస్‌లు వ్యాప్తిలో ఉన్నట్లు అంచనా. కోవిడ్ టీకాలపై జన్యుమార్పుల ప్రభావం దాదాపు లేనట్లే.
కోవిడ్ టీకా ముందుగా ఎవరికి?
ఆయా దేశాల్లోని నియంత్రణ సంస్థలదే తుది నిర్ణయం. వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులతోపాటు వ్యాధి కారణం గా మరణించే అవకాశాలు ఉన్న వారికి ప్రాధాన్యం లభిస్తుంది.
టీకా వేసుకున్న తరువాత కూడా వ్యాధి సోకే అవకాశం ఉందా?
టీకా తయారైన విధానం ఆధారంగా కొంతమందికి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. బలహీన పరచిన వైరస్‌తో తయారైన టీకా కేన్సర్ రోగుల్లో వ్యాధి కలుగ చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
– గిళియార్ గోపాలకృష్ణ మయ్యా
Comments
Please login to add a commentAdd a comment