
గువహటి: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనకు ఆదివారం ఉదయం 2 గంటలకు ఫోన్ చేశారని తెలిపారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. గువహటిలో పఠాన్ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్‌పై దాడి జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ విషయంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చానని, శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వం బాధ్యత అని చెప్పానని వివరించారు.
అయితే శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో షారుఖ్ ఖాన్ అంటే ఎవరో తనకు తెలియదన్నారు హిమంత. మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నుంచి చాలా మంది తనకు ఫోన్ చేస్తారని, కానీ ఇప్పటివరకు ఆ ఖాన్ ఎవరో తనకు కాల్ చేయలేదని పేర్కొన్నారు. ఒకవేళ అతను ఫోన్ చేస్తే సమస్యల గురించి ఆలోచిస్తానన్నారు. ఆ మరునాడే షారుఖ్ హిమంతకు ఫోన్ చేయడం గమనార్హం.
షారఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం ఈనెల 25న దేశవ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే ఈ చిత్రంలోని ఓ పాటలో హీరోయిన్ దీపికా పదుకొనే కాషాయం రంగు బికినీలో కన్పించింది. దీన్ని హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే గువహటిలోని నరెంగిలో పఠాన్ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్‌పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో షారుఖ్ ఖాన్ స్వయంగా సీఎంకు ఫోన్ చేశారు.
చదవండి: జనాభాను పెంచేందుకు సిక్కింలో ప్రభుత్వోద్యోగినులకు వరాలు