ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బిహార్, మహారాష్ట్రల మధ్య వివాదాలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సుశాంత్ రాజ్‌పుత్ మృతి దర్యాప్తుపై స్పందించారు. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులకు మొదటి అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శరద్ పవార్ మనవడు పార్థ్ పవార్(అజిత్ పవార్ కుమారుడు) కూడా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై పవార్ స్పందించారు. ఇవి పరిణితి లేని వ్యాఖ్యలు అని.. వాటిని తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని మనవడిని బహిరంగంగా మందలించారు పవార్. (బాంద్రా డీసీపీ- రియా ఫోన్ కాల్స్)
సుశాంత్ మృతిపై ముంబై పోలీసుల దర్యాప్తు సరిగా సాగడం లేదని.. వారి మీద తమకు నమ్మకం లేదని సుశాంత్ కుటుంబ సభ్యులు బిహార్ ముఖ్యమంత్రిని కోరిన సంగతి తెలిసిందే. దాంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు నితీష్ కుమార్. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బిహార్ సీఎం ఇలా చేశారని.. శివసేన ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర పోలీసులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారు నాకు గత 50 ఏళ్ల నుంచి తెలుసు. వారి మీద పూర్తి నమ్మకం ఉంది. ఆరోపణలను నేను పట్టించుకోను. ముందు వారిని లోతుగా దర్యాప్తు చేయనిద్దాం. తర్వాత కేసును సీబీఐకి లేదా ఇతర ఏజెన్సీలకు అప్పగించినా మేము వ్యతిరేకించం’ అన్నారు పవార్. (సీబీఐ దర్యాప్తు: రియా స్పందన)
ఈ కేసులో రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉన్నట్లు వస్తోన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. అసలు ఆదిత్య పేరును ఇందులోకి ఎందుకు లాగుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు పవార్. ఆదిత్య పేరును బీజేపీనే వివాదంలోకి లాగిందని ఆయన ఆరోపించారు. ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుతో ఆదిత్య ఠాక్రేకు ఏం సంబంధం ఉంది. రాష్ట్రంలో మా మద్దతుతో శివసేన అధికారంలోకి రావడాన్ని ప్రతిపక్షాలు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాయి. అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయి’ అని సీనియర్ సేన నాయకుడు సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. (బాలీవుడ్‌తో సంబంధాలు నిజమే: ఆదిత్య ఠాక్రే)
Comments
Please login to add a commentAdd a comment