
ముంబయి: అయోధ్య రామ మందిరంలో జనవరి 22న జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ తెలిపారు. ఆహ్వానం పంపించినందుకు రామమందిరం ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణప్రతిష్ఠకు పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నందున దర్శనం పొందడం సులభం కాదని అన్నారు. జనవరి 22 తర్వాత దర్శనం పొందడం సులభం అవుతుందని ఆయన చెప్పారు. త్వరలో అయోధ్యను దర్శిస్తానని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి, భక్తికి రాముడు ప్రతీక అని శరద్ పవార్ అన్నారు. "అయోధ్యలో జరిగే కార్యక్రమం కోసం రామభక్తులలో విపరీతమైన ఉత్సాహం ఉంది. వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఈ చారిత్రాత్మక సందర్భం నాకు ఆనందాన్నిస్తోంది. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత దర్శనం పొందడం సులభం అవుతుంది" అని శరద్ పవార్ ఓ ప్రకటనలో తెలిపారు. అయోధ్య రామున్ని త్వరలో ప్రార్థిస్తానని శరద్ పవార్ పేర్కొన్నారు. అప్పటికి రామమందిర నిర్మాణం కూడా పూర్తవుతుందని చెప్పారు.
జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. జనవరి 16 నుంచే ప్రాణప్రతిష్ఠకు జరగాల్సిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రజాప్రతినిధులతో సహా సెలబ్రిటీలకు కూడా ఆహ్వానాలు అందాయి. జనవరి 23 నుంచి రామాలయాన్ని సాధారణ భక్తుల దర్శనం కోసం తెరవనున్నారు.
ఇదీ చదవండి: Lata Mangeshkar: లతా మంగేష్కర్ ఆఖరి రామ శ్లోకాన్ని షేర్ చేసిన ప్రధాని మోదీ!