సాక్షి, న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రైతుల ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసకు సంబంధించి మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు జనవరి 26న రైతు ఆందోళన సందర్బంగా ఎర్రకోట హింస ఘటన కేసులో ప్రధాన నిందితుడు దీప్ సిద్దూను అరెస్ట్ చేశారు. మరోవైపు ర్యాలీలో చోటు చేసుకున్న ఘటనలు, హింసపై ట్వీట్లకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఆరుగురు జర్నలిస్టులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. వారిలో ఎవర్నీ అరెస్టు చేయడానికి వీల్లేదంటూ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. రెండు వారాల తర్వాత ఈ కేసులను విచారణకు స్వీకరించనున్నామని చీఫ్ జస్టిస్ శరద్ బోబ్డే, బొపన్నా, సుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. (రైతు ఉద్యమం : దీప్ సిద్దూ అరెస్టు)
అయితే ఢిల్లీ పోలీసుల తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వారి తప్పుడు ట్వీట్లు గణతంత్ర దినోత్సవం రోజున భారీ భయాందోళనలు సృష్టించాయన్నారు. థరూర్‌తో పాటు ఆరుగురు జర్నలిస్టుల కేసును రేపే విచారించాలని, వారికిఎలాంటి ఉపశమనం కల్పించవద్దని కోరారు. అయితే కేసును విచారించేంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని డిఫెన్స్ లాయర్ కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు.
మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళనకుదిగారు. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ అనూహ్యంగా హింసాత్మక సంఘటలనకు దారి తీసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, ఆరుగురు ప్రముఖ జర్నలిస్టులు ట్విట్ చేయడం వివాదం రేపింది. దీంతో సినీయర్ జర్నలిస్టులు రాజ్‌దీప్ సర్దేశాయ్, మ్రినాల్ పాండే, జాఫర్ ఆఘా, వినోద్ జోస్, పరేశ్ నాథ్, అనంత్ నాథ్‌తో పాటు శశిథరూర్‌పై దేశద్రోహం, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, నేరపూరిత కుట్ర లాంటి అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఈ కేసులను ఎత్తివేయాలని వీరు సుప్రీంను ఆశ్రయించారు. కాగా రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీలో ఢిల్లీ పోలీసుల కాల్పుల్లో ఒక రైతును చంపారని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. అయితే ట్రాక్టర్ తిరగబడి సదరు రైతు చనిపోయాడని పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment