
సాక్షి, ముంబై: పేరుకు ఆయనో పెద్ద లీడర్.. కానీ, మాస్కు పెట్టుకోవడం మాత్రం రాదు. కరోనా సమయంలో మాస్కు ధరించాలని అటు వైద్యులు, ఇటు ప్రభుత్వాలు ప్రజలను కోరిన విషయం తెలిసిందే. ఒకానొక దశలో ప్రభుత్వాలు మాస్కులు ధరించని వారికి జరిమానాలు సైతం విధించింది. దీంతో పల్లెటూరు నుంచి పట్నం దాకా.. మాస్కు ఎలా ధరించాలో అందరికీ తెలిసిపోయింది.
కాగా, శివసేన పార్టీకి చెందిన ఓ నేత తాజాగా మాస్కు ధరించేందుకు 2 నిమిషాల పాటు తర్జనభర్జన పడ్డారు. అప్పటికీ మాస్కు ఎలా పెట్టుకోవాలో తెలియక మరో వ్యక్తి సాయంతో చివరకు మాస్కు ధరించాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయన తీరుపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో శివసేన పార్టీ కూడా బరిలో నిలిచింది. ఆ పార్టీకి చెందిన 41 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాగా, శివసేన నేతలు గోరఖ్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా గోరఖ్‌పూర్‌లో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో శివసనే నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభలో శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే మాట్లాడుతుండగా.. ఆయన వెనుక నిలుచున్న ఓ శివసేన నేత.. ఎన్-95 మాస్కును ఎలా ధరించాలో తెలియక దాదాపు రెండు నిమిషాలు తీవ్ర ప్రయత్నం చేశాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మాస్కు పెట్టుకోవాడం రాకపోవడంతో చివరకు పక్కనున్న మరో నేత సాయం కోరాడు. ఆయన సాయంతో చివరకు మాస్కు ధరించాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ నేతపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో పాటు.. మాస్క్ పెట్టుకోగానే ప్రజలు సంబురాలు చేసుకున్నట్లు ఓ స్పూఫ్ వీడియో కూడా జతపరిచారు.
w8 for it...! 😁 pic.twitter.com/uG7gkaNLBg
— Andolanjivi faijal khan (@faijalkhantroll) February 24, 2022