ముంబై: 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై ఐఎఫ్‌ఎఫ్‌ఐ జ్యూరీ చీఫ్ నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ ఈ విషయంపై స్పందించారు. నడవ్ లాపిడ్‌కే మద్దతుగా నిలిచారు.
ది కశ్మీర్ ఫైల్స్ దురుద్దేశంతో తీసిన సినిమా అనడంలో వాస్తవం ఉందని రౌత్ పేర్కొన్నారు. ఈ సినిమాలో కావాలనే ఒక వర్గం వారిని తప్పుగా చూపించారని చెప్పారు. దీని పబ్లిసిటీలో ఒక పార్టీ, ప్రభుత్వం ఫుల్ బిజీగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదల అయ్యాకే జమ్ముకశ్మీర్లో హత్యలు విపరీతంగా పెరిగాయని రౌత్ చెప్పుకొచ్చారు.
'కశ్మీర్ ఫైల్స్ సినిమాకు పబ్లిసిటీ చేస్తున్న వారు అప్పుడేమయ్యారు. కశ్మీరీ పండిట్ల పిల్లలు ఆందోళనలు చేసినప్పుడు వీళ్లు ఎక్కడున్నారు. వాళ్ల కోసం ఎవరూ ముందుకు రాలేదు. కశ్మీర్ పైల్స్ 2.0 తీయాలనుకుంటే అది కూడా పూర్తి చేయండి' అని రౌత్ వ్యాఖ్యానించారు.
గోవా వేదికగా జరిగిన అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో 'ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని' ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూసిన జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ది కశ్మీర్ ఫైల్స్ అసభ్యంగా ఉందని, ప్రచారం కోసమే ఈ సినిమా తీశారని విమర్శలు గుప్పించాడు. అసలు దీన్ని ఈ వేడుకలో ఎలా ప్రదర్శించారో అర్థం కావడం లేదన్నారు. ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించిన 15 చిత్రాల్లో 14 బాగున్నాయని, ది కశ్మీర్ ఫైల్స్ మాత్రమే చెత్తగా ఉందన్నారు.
నడవ్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. కశ్మీర్ పండిట్ల బాధ పట్ల ఆయనకు విచారం లేదని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం నడవ్ వాఖ్యల్లో వాస్తవం కూడా ఉందని మద్దతుగా నిలుస్తున్నారు.
చదవండి: ‘కశ్మీర్ ఫైల్స్’పై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment