
ముంబై: శివసేన (ఠాక్రే) వర్గానికి చెందిన నాయకుడు అభిషేక్ ఘోసల్కర్ దారుణంగా హత్యచేయబడ్డారు. ఆయన లైవ్ వీడియోలో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. తాజాగా ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యాపారవేత్త మోరిస్ నోరోన్హాను అనుమానితుడిగా భావిస్తున్నారు. గురువారం సాయంత్రం సబర్బన్ ముంబైలోని బిరివాలిలోని మోరిస్ నోరోన్హా కార్యాలయంలోనే ఈ కాల్పులు జరగటం గమనార్హం.
ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో మాట్లాడతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిగిన వెంటనే అభిషేక్ ఘోసల్కర్‌ను స్థానిక కరుణ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అభిషేక్ ఘోసల్కర్ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
అభిషేక్ ఘోసల్కర్... శివసేన(యూబీటీ) మాజీ ఎమ్మెల్యే వినోద్ ఘోసల్కర్ కుమారుడు. వ్యాపారవేత్త అయిన మోరిస్ నోరోన్హాకు అభిషేక్ ఘోసల్కర్ మధ్య ఇటీవల చోటుచేసుకున్న వివాదాల కారణంగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ కాల్పులు జరిగినప్పుడు ఘటన స్థలంలో మెహుల్ పారిఖ్ అనే వ్యక్తి ఉన్నట్లు సమాచారం అందటంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు నోరోన్హా కూడా తనను తాను కాల్చుకొని మృతి చెందాడని వార్తలు వస్తున్నాయి. గత వారంలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు శివసేన (షిండే) వర్గం నేతపై పోలీస్ స్టేషన్‌లోనే కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment