న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. జహంగీర్‌పురి ప్రాంతంలో ర్యాలీపై దుండగులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఈ దాడిలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒక స్థానికుడు, ఎనిమిది మంది పోలీసులు ఉన్నారు.
గాయపడిన వారిలో ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మేధలాల్ మీనా కూడా ఉన్నారు. అతని చేతికి బుల్లెట్ గాయమైంది. అయితే అతని ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో కాల్పులు జరిపిన అస్లాం కూడా ఉన్నాడు. నిందితుడి నుంచి ఒక కంట్రీమేడ్ పిస్తోల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఢిల్లీలో రాళ్లదాడి, హింసాత్మక ఘటనలకు సంబంధించి 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియాలోని వీడియోల ద్వారా మరింతమంది అనుమానితులను గుర్తించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్త: ఢిల్లీ హనుమాన్ జయంతి శోభాయాత్రపై రాళ్ల దాడి
హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా చెలరేగిన ఘర్షణలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వహించడంపై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పించాయి. దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడాలని, 13 ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి. అలాగే మతపరమైన హింసలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు శనివారం సంతకాల సేకరణ ద్వారా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
దేశంలో జరుగుత్ను మతపరమైన ఉద్రిక్తతలపై ప్రధాని మౌనం వహించడం షాక్‌కు గురిచేసిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడటంలో, చర్యలు తీసుకోవడంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. ‘ప్రధాని మౌనం.. ఇలాంటి ప్రైవేట్ సాయుధ గుంపులను అధికారికంగా ప్రోత్సాహించినట్లే అవుతుంది. వాళ్లు సంఘంలో విలాసాల్ని అనుభవిస్తున్నారనడానికి ఒక స్పష్టమైన సాక్ష్యంగా నిలిచింది’ అని విపక్షాలు ప్రకటనలో పేర్కొన్నాయి. ఇక సంతకం చేసిన పార్టీల్లో కాంగ్రెస్, తృణమూల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ(ఎం), డిఎంకే, ఆర్‌జేడీ, ఇతర ప్రధాన ప్రతిపక్షాలు ఉన్నాయి. కాగా శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు జాబితాలో లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment