సాక్షి, భువనేశ్వర్/పూరీ: పూరీలోని ఎమ్మార్ మఠం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సుమారు 11 ఏళ్ల తర్వాత ఈ మఠంలో అత్యంత అమూల్యమైన ప్రాచీన సొత్తు నిక్షిప్తంగా ఉందనే నమ్మకం సర్వత్రా బలపడింది. ఈ మఠానికి గతంలో ఉన్న మహంత ఆధిపత్యం రద్దు చేసి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డు బాధ్యతల స్వీకరణ పురస్కరించుకుని మఠంలో వెలుగు చూస్తున్న సొత్తుపట్ల అంతా అవాక్కవుతున్నారు. అయితే ఈ సొత్తు లోగడ ఖరారు చేసిన జాబితాలో ఉన్నదీ లేనిదీ స్పష్టం కావలసి ఉంది. ట్రస్టు బాధ్యతల స్వీకరణలో భాగంగా శనివారం మఠం 4వ నంబరు గది తెరవడంతో ప్రాచీన కాంస్య ఆవు, దూడ విగ్రహం బయటపడింది. దీంతో పాటు 16 పురాతన కత్తులు, వెండి ఇటుకలు, ఆభరణాలు, వంటపాత్రలు బయటపడ్డాయి. ఆవు దూడ కాంస్య విగ్రహం ఝులన్ జాతర (డోలోత్సవం)లో వినియోగించి ఉంటారని భావిస్తున్నారు.
ట్రస్టుకు బాధ్యతలు
ఎమ్మార్ మఠం బాధ్యతలు ట్రస్టు బోర్డుకు అప్పగించారు. ఉత్తర పార్శ్వ మఠం మహంత నారాయణ రామానుజ దాస్, జగన్నాథ సంస్కృతి ప్రచారకులు నరేష్ చంద్ర దాస్, సంఘసేవకులు ప్రతిమ మిశ్రా, ప్రముఖ న్యాయవాది బొనొ బిహారి నాయక్, సిటీ డీఎస్‌పీతో కొత్త ట్రస్టు బోర్డు ఏర్పాటైంది. ఈ బోర్డు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మఠంలో ఒక్కో గది తెరిచి చూడబోతే అమూల్యమైన సంపద, సొత్తు బయటపడుతోంది. ఇంతకు ముందు 2011వ సంవత్సరంలో 522 వెండి ఇటుకలు వెలుగు చూసిన సంఘటన తీవ్ర సంచలనం రేపింది. అది మొదలుకొని మఠంలో అత్యంత అమూల్యమైన రత్నవైడూర్యాలు వగైరా నిక్షిప్త నిధి ఉండి ఉంటుందనే ఊహాగానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ప్రాచీన మఠంగా గుర్తింపు
శ్రీ మందిరం పరిసరాల్లో అత్యంత పురాతనమైనదిగా ఎమ్మార్ మఠం పేరొందింది. 12వ శతాబ్దంలో సంత్ రామానుజాచార్య ఆగమనం పురస్కరించుకుని ఎమ్మార్ మఠం నిర్మితమైనట్లు పరిశోధకుల అంచనా. జగన్నాథుని సంస్కృతి సంప్రదాయాలు, నైవేద్యాలు, ప్రసాదాల పరంపరతో ముడిపడిన మఠంగా ప్రాచుర్యం సంతరించుకుంది. శ్రీ మందిరం నలు వైపుల ఆధునికీకరణ పురస్కరించుకుని ఈ మఠం తొలగించేందుకు పూరీ జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. 2019వ సంవత్సరంలో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక తొలగింపు పనుల్లో రహస్య గదుల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ గదుల్లో గుప్తనిధి ఉండవచ్చన్న అనుమానాలు బలపడ్డాయి. 1866వ సంవత్సరంలో సంభవించిన కరువు కాటకాల సమయంలో ఈ మఠం ప్రజలకు భోజనాదులు అందజేసి అక్కున చేర్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే వందలాది సంవత్సరాలు ఈ మఠం ఎందరో సాధుసంతువులు, భక్తులు, బీదాబిక్కి ప్రజలకు నిరవధికంగా అన్న సంతర్పణ చేసినట్లు పరిశోధకులు భావిస్తున్నారు.
మెజిస్ట్రేట్ సమక్షంలో గాలింపు
మెజిస్ట్రేట్, పోలీసుల సమక్షంలో ట్రస్టు బోర్డు సభ్యులు ఈ గాలింపు చర్యలు చేపడుతున్నారు. దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టరు, ట్రస్టు సభ్యుల సమక్షంలో ఎమ్మార్ మఠం సొత్తు జాబితా తయారవుతోంది. ఇప్పటి వరకు 3 గదులు తెరిచి గాలింపు ముగించారు. మరో 50 పైబడి ఇటువంటి గదులు ఉన్నట్లు భావిస్తున్నారు. శనివారం నిర్వహించిన గాలింపులో తొలుత 8, తదుపరి 37 వెండి ఇటుకలు బయటపడినట్లు అనధికారిక సమాచారం.
కాంట్రాక్టర్ చేతివాటం
మఠంలోని 2 గదుల మరమ్మతు కోసం 2011లో పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో చెక్కపెట్టెల్లో 522 వెండి ఇటుకలు లభించాయి. మరమ్మతు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఈ సొత్తును దొంగతనంగా కటక్ నగరంలో విక్రయించడంతో ఢెంకనాల్‌కు తరలిపోయింది. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఢెంకనాల్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి పూరీ సింహద్వారం స్టేషన్ పోలీసులు ఈ వెండి ఇటుకల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మఠం నిర్వాహకుడు మహంత రాజగోపాల్‌తో పాటు ఆయన అనుచరుల్ని పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వెండి ఇటుకలను జిల్లా పోలీసు ఆయుధాగారంలో భద్రపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment