కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీకి రెండోసారి అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. గంగూలీని వంచించారని, అన్యాయంగా రేసు నుంచి తప్పించారని ఆరోపించారు. దాదా బెంగాల్‌కు మాత్రమే కాదు యావత్ దేశానికి గర్వకారణమని, అత్యంత ప్రజాదరణ గల వ్యక్తి అని కొనియాడారు. టీమిండియా కెప్టెన్‌గా విశేష సేవలందించిన ఆయనకు ఇలా జరగడం తనను షాక్‌కు గురి చేసిందని మమత పేర్కొన్నారు. గంగులీ ఏం తప్పు చేశారని ఆయనను పక్కకు పెట్టారని ప్రశ్నించారు.
గంగూలీ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు మమత. బీసీసీఐ పదవి ఇవ్వనప్పుడు ఆయనను ఐసీసీకి పంపితే న్యాయం చేసినట్లవుతుంది సూచించారు. అందుకే ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాదాకు అనుమతి ఇవ్వాలని కోరారు. తన విజ్ఞప్తిని ప్రతీకార రాజకీయంగా చూడొద్దని, క్రికెట్ కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, కార్యదర్శిగా జైషా రెండోసారి కొనసాగేందుకు కోర్టు అనుమతిచ్చిన విషయాన్ని మమత గుర్తు చేశారు. అమిత్‌షా కుమారుడైన జైషాను మాత్రం కొనసాగించి, గుంగూలీని తప్పించానికి కారణమేంటని ప్రశ్నించారు.
ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల నామినేషన్‌కు అక్టోబర్ 20 చివరితేది. ఈ పదవికి భారత్ నుంచి ఎవరైనా పోటీ చేయాలనుకుంటే బీసీసీఐ వాళ్ల పేరును సిఫారసు చేయాల్సి ఉంటుంది. మరోవైపు బీసీసీఐ, ఐసీసీలో ఎలాంటి పదవి దక్కే సూచనలు లేకపోవడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తానని గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన స్థానంలో రోజర్ బిన్నీ పేరు దాదాపు ఖరారైంది.
చదవండి: సింగిల్ బ్రాండ్ భారత్‌తో అన్ని సబ్సిడి ఎరువులు: మోదీ కొత్త స్కీం
Comments
Please login to add a commentAdd a comment