
సాక్షి, న్యూఢిల్లీ : అన్‌లాక్ 2.0లో భాగంగా అమలవుతున్న కోవిడ్-19 నియంత్రణలు జులై 31న ముగియనుండటంతో అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. ఆగస్ట్ నుంచి అమలవనున్న అన్‌లాక్ 3.0లో లాక్‌డౌన్‌కు మరిన్ని సడలింపులు ప్రకటిస్తారని భావిస్తున్నారు. పాఠశాలలు, కాలేజీలు సహా విద్యాసంస్ధలు, మెట్రో సర్వీసులను తెరిచేందుకు ఇప్పట్లో అనుమతి లభించకున్నా ఆగస్ట్ 1 నుంచి సినిమా హాళ్లు, జిమ్‌లకు అనుమతించే అవకాశం ఉందని భావిస్తున్నారు. భౌతిక దూరం వంటి కఠిన నిబంధనలతో కూడిన నిర్ధిష్ట మార్గదర్శకాలతో సినిమా హాళ్లను తిరిగి తెరిచేందుకు వెసులుబాటు కల్పిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సినిమా థియేటర్లను అనుమతించే ప్రతిపాదనను సమాచార, ప్రసార శాఖ హోంమంత్రిత్వ శాఖ ముందుంచింది.
ఈ ప్రతిపాదనకు ముందు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ థియేటర్ యజమానులను సంప్రదించగా 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లను అనుమతించాలని కోరారు. అయితే ముందుగా 25 శాతం సీటింగ్ సామర్థ్యంతో, భౌతిక దూరం వంటి నిబంధనలను పాటిస్తూ థియేటర్లను తెరవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. కోవిడ్-19 కేసుల తీవ్రతకు అనుగుణంగా రాష్ట్రాలు సొంతంగా మార్గదర్శకాలను జారీచేయవచ్చని కేంద్రం తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా స్కూళ్లు, మెట్రో రైలు సర్వీసుల మూసివేత వంటి కొన్ని నియంత్రణలు అన్‌లాక్ 3లోనూ కొనసాగుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పాఠశాలల పునఃప్రారంభంపై పాఠశాల విద్య కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రాలతో మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డీ) ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించింది. ఈ అంశంపై తల్లితండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించామని పాఠశాలలను తెరవడంపై వారు సానుకూలంగా లేరని హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. చదవండి : నియంత రాజ్యంలో తొలి కరోనా కేసు
Comments
Please login to add a commentAdd a comment