అంతరిక్షంలో పెళ్లి చేసుకుందామా? | Space tour wedding to come in future | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలో పెళ్లి చేసుకుందామా?

Published Wed, Jul 21 2021 1:54 AM | Last Updated on Wed, Jul 21 2021 1:55 AM

Space tour wedding to come in future - Sakshi

వారంకింద
వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌ ఫ్లైట్లో బ్రాన్సన్, శిరీష, మరో నలుగురు..
ఇప్పుడు
బ్లూ ఆరిజిన్‌ రాకెట్లో జెఫ్‌ బెజోస్, ఆయన టీమ్‌.. అంతరిక్షంలో కాసేపు చక్కర్లు కొట్టి వచ్చేశారు.

వచ్చే ఏడాది నుంచే స్పేస్‌ టూర్లు మొదలుపెడతామనీ ప్రకటించారు. స్పేస్‌ టూర్‌ వరకు సరే.. మరి అలా అంతరిక్షంలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటే.. పుట్టినరోజు వేడుకలో, మరో పార్టీయో చేసుకోవాలనుకుంటే.. అదేదో బాగుంటుంది అనిపిస్తోంది కదా.. ఆ చాన్స్‌ కూడా వచ్చేస్తోంది. జస్ట్‌ ఓ మూడేళ్లు ఆగితే చాలు. మన దగ్గరి వాళ్లను వెంటేసుకుని అంతరిక్షంలో తేలియాడుతూనే ఫంక్షన్లు కూడా చేసేసుకోవచ్చు. ‘స్పేస్‌  పర్‌స్పెక్టివ్‌’ సంస్థ ఇందుకు రంగం సిద్ధం చేస్తోంది.

భారీ స్పేస్‌ బెలూన్‌.. 
హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ తరహాలో.. ఓ భారీ హైడ్రోజన్‌ స్పేస్‌ బెలూన్, దానికి వేలాడదీసే గుండ్రటి ప్యాసింజర్‌ క్యాప్సూల్‌ను అమెరికాకు చెందిన ‘స్పేస్‌ పర్‌స్పెక్టివ్‌’ సంస్థ అభివృద్ధి చేస్తోంది. దీనికి ‘నెప్ట్యూన్‌’ అని పేరు పెట్టింది. ఈ బెలూన్‌ షిప్‌ సుమారు 30.5 కిలోమీటర్లు (లక్ష అడుగుల) ఎత్తుకు వెళ్లి.. అక్కడ రెండు గంటల పాటు ఉండి తిరిగి భూమ్మీదికి దిగుతుంది. మొత్తంగా టేకాఫ్‌ నుంచి కిందికి దిగేవరకు ఆరు గంటలు సమయం పడుతుంది. క్యాప్సూల్‌లో విశాలమైన అద్దాల గది, మినీ బార్, బాత్రూం, ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంటాయి. పైలట్‌ కాకుండా ఎనిమిది మంది ప్యాసింజర్లకు అవకాశం ఉంటుంది. ముందే ఆర్డర్‌ చేసిన ఫుడ్, డ్రింక్స్‌ అందిస్తారు. గుండ్రంగా చుట్టూ అద్దాలతో ఉండే క్యాప్సూల్‌ నుంచి అన్ని వైపులా వీక్షించవచ్చు. ఈ కంపెనీ గత నెలలోనే ‘నెప్ట్యూన్‌ వన్‌’ పేరిట టెస్ట్‌ ఫ్లైట్‌ను విజయవంతంగా నిర్వహించింది.

నిశ్శబ్దంగా.. ప్రశాంతంగా..
మామూలుగా రాకెట్లు, స్పేస్‌ షటిల్స్‌ ఏవైనా.. అత్యంత భారీగా శబ్దం, ఊగిపోతూ (కంపిస్తూ) ఉంటాయి. ఒకరి మాటలు మరొకరికి వినపడే పరిస్థితే ఉండదు. అదే స్పేస్‌ బెలూన్‌లోని క్యాప్సూల్‌లో అయితే.. ఇంట్లోనే ఓ గదిలో ఉన్నట్టుగా నిశ్శబ్ధంగా, ప్రశాంతంగా ఉంటుందని.. వివాహాలు, పుట్టినరోజులు వంటివి చేసుకోవచ్చని స్పేస్‌ పర్‌స్పెక్టివ్‌ సంస్థ పేర్కొంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఆర్డర్లు కూడా వస్తున్నాయని తెలిపింది.

ఒక్కొక్కరికి 93.3 లక్షలు..
2024
నుంచే వినియోగదారులను అంతరిక్షంలోకి తీసుకెళ్తామని స్పేస్‌ పర్‌స్పెక్టివ్‌ సంస్థ వెల్లడించింది. జూన్‌లోనే టికెట్లు అమ్మడం మొదలుపెట్టేసింది. ఒక్కొక్కరికి రూ.93.3 లక్షలు వసూలు చేస్తోంది. 2024 ఏడాదికి సంబంధించి టికెట్లు అన్నీ బుక్‌ అయిపోయాయని, 2025లో నిర్వహించే యాత్రలకు టికెట్లు ఇస్తున్నామని ప్రకటించింది. భవిష్యత్తులో రేట్లు బాగా తగ్గే అవకాశం ఉందని.. వేరే దేశానికి విమానంలో వెళ్లినంత ఖర్చుతో అంతరిక్ష యాత్రలు చేయవచ్చని కంపెనీ యజమానులు టేబర్‌ మెకల్లం, జేన్‌ పోంటర్‌ చెప్తున్నారు. 

‘నెప్ట్యూన్‌’ స్పేస్‌ క్యాప్సూల్‌ ప్రయాణం ఇలా..
    1.     భారీ హైడ్రోజన్‌ బెలూన్‌ స్పేస్‌ క్యాప్సూల్‌ను తీసుకుని గాల్లోకి ఎగురుతుంది.
    2.     గంటకు 15–16 కిలోమీటర్ల వేగంతో రెండు గంటల పాటు పైకి ప్రయాణిస్తుంది.
    3.    ప్రయాణికుల విమానాలు ప్రయాణించే గరిష్ట ఎత్తు 45 వేల అడుగులు (13.7 కిలోమీటర్లు). దాన్ని దాటేస్తూ పైకి వెళ్తుంది. 
    4.     30.5 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నాక.. రెండు గంటల పాటు ప్రయాణిస్తుంది.
    5.     తర్వాత బెలూన్‌ మెల్లగా సంకోచిస్తూ కిందికి దిగుతుంది.
    6.      సముద్రంలోని నిర్ణీత ప్రదేశంలో దిగి.. తేలియాడుతూ ఉంటుంది.
  7.   అప్పటికే కొంతదూరంలో సిద్ధంగా ఉంచిన షిప్‌ అక్కడికి వెళ్లి.. స్పేస్‌ క్యాప్సూల్‌ను, బెలూన్‌ను లిఫ్ట్‌ చేస్తుంది. క్యాప్సూల్‌లోని వారు నౌకలోకి దిగి, తీరానికి చేరుకుంటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement