
పూరీ/హసన్: ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుని ఆలయం, కర్ణాటకలో హసన్‌లో ఉన్న హసనాంబ ఆలయాల్లో శుక్రవారం వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. రద్దీ కారణంగా చోటుచేసుకున్న తోపులాటల్లో 27 మంది వరకు గాయపడ్డారు. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు వివరించారు. శుక్రవారం వేకువజాము నుంచే ఆలయానికి భక్తుల రాక మొదలైందని శ్రీ జగన్నాథ్ ఆలయ అధికారులు తెలిపారు.
మంగళ హారతి సమయంలో గేట్లు తెరవడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుని 10 మంది భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధ మహిళలున్నారని అన్నారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు చెప్పారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారని తెలిపారు.
ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువైందే తప్ప తోపులాట జరగలేదని పూరీ ఎస్‌పీ కేవీ సింగ్ స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలోని హసనాంబ ఆలయంలో క్యూలైన్లలోని వారు విద్యుత్ షాక్‌కు గురై 17 మంది వరకు గాయపడ్డారు. ఇది తోపులాటకు దారితీసింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. బాధితులు చెబుతున్న కరెంట్ షాక్ విషయమై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment