న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన రోజు రోజుకు తీవ్రమవుతోంది తప్ప తగ్గడం లేదు. మొదట రైతులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఎక్కువగా ఈ ఆందోళనలో పాల్గొనగా, ఇప్పుడు రైతులకు మద్దతుగా వామపక్ష పార్టీలు, దళితులు, ముస్లింలు, కశ్మీరీలు, విమర్శకులు, ప్రభుత్వం పట్ల అసంతప్తితో ఉన్నవారు, విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ వర్గాలకు చెందిన వారిలో కొంత మంది నేరుగా ఆందోళనలో పాల్గొంటుండగా, మిగతావారు రైతులకు అవసరమైన అన్న పానీయాలను సమకూర్చడంలో నిమగ్నమై ఉన్నారు. (చదవండి : ప్రభుత్వం పరిష్కారం చూపాల్సిందే)
రైతు ఆందోళనలో పంజాబ్ నుంచి సిక్కులు ఎక్కువగా పాల్గొంటుండగా, వారికి మద్దతుగా వారి కుటుంబాల నుంచి వలసపోయిన వారు కెనడాలో, ఇంగ్లండ్‌లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. భారత దేశంలో రైతులది బలమైన వర్గం. భూమి పట్ల వాళ్లకు విడదీయలేని అనుబంధం. అలాంటి భూమి తమ చేతుల నుంచి దూరమవుతుందని భావిస్తే రైతులు ఊపిరి ఉన్నంత వరకు ఆందోళన కొనసాగిస్తారు.
నాడు బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జాతిపిత గాంధీ చేపట్టిన స్వాతంత్య్రోద్యంలో కూడా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి శక్తిని ముందుగా ఊహించిన గాంధీ వారిని ప్రత్యేకంగా ఉద్యమంలోకి లాగారు. రైతుల శక్తి గురించి ప్రధాని నరేంద్ర మోదీకిగానీ, పాలకపక్ష బీజేపీకి తెలియందికాదు. నేరుగా రైతుల జోలికి వెళ్లకుండా వారి ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే తీసుకొస్తున్నామంటూ వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. (చదవండి : కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం)
దేశంలో వ్యవసాయ సంస్కరణల ఆవశ్యకతను, అందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సూచిస్తూ స్వామినాథన్ లాంటి వ్యవసాయ నిపుణులు సమర్పించిన నివేదికను పట్టించుకోకుండా మోదీ నేరుగా చట్టాలను తెచ్చారంటే దాని వెనక కచ్చితంగా ఏదో కుట్ర ఉండే ఉంటుందని, అంబానీ లాంటి మిత్రులకు వ్యవసాయ మార్కెట్‌ను కట్టబెట్టడం కోసమేనంటూ రైతులు ఆందోళన చెందుతున్నారంటూ రైతు నాయకులు ఇప్పటికే తేల్చి చెప్పారు. కొత్త చట్టాలతోని వ్యవసాయ సంస్కరణలు మొదలైనట్లేనని, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించేందుకు కార్పోరేట్ రంగాన్ని పోటీగా రంగంలోకి దించడం వల్ల రైతులకు కూడా ప్రయోజనం కలుగుతోందని కొందర మేధావులు వాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment