న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల రద్దు కోసం నిర్విరామంగా చేస్తున్న రైతుల పోరాటం గణతంత్ర దినోత్సవం రోజు తీవ్ర రూపం దాల్చింది. ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్ల పరేడ్‌కు సుప్రీంకోర్టు సూచనతో పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే మంగళవారం పరేడ్ చేపట్టడానికి రైతులు వెళ్తుండగా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లు ధ్వంసం చేసి ఆందోళన చేపట్టేందుకు ఢిల్లీ సరిహద్దుకు తరలివస్తున్నారు.
ఈ క్రమంలో రైతులను అడ్డగించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. టిక్రీ సరిహద్దు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో రైతులు వస్తుండడంతో ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మొహరించారు. ఘాజీపూర్ సరిహద్దు వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. రోడ్డుకు అడ్డుగా పెట్టిన కంటెయినర్లను రైతులు ట్రాక్టర్లతో నెట్టివేశారు. ఘాజీపూర్ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించారు. ఇక రైతుల ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా ఉన్న సింఘు సరిహద్దులో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.
పెద్ద సంఖ్యలో రైతులు ఉండడంతో పరిస్థితి చేయి దాటి పోతుందనేలా ఉంది. సంజయ్‌గాంధీ ట్రాన్స్‌పోర్ట్ నగర్ వద్ద ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులపై టియర్ గ్యాస్‌ను పోలీసులు ప్రయోగించారు. రైతులను నిలువరించేందుకు వాటర్ క్యానన్లు కూడా ప్రయోగించి వారిని అడ్డగించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాటర్ క్యానన్ల వాహనాలపైకి ఎక్కి రైతులు నినాదాలు చేస్తున్నారు. రైతుల పోరాటం మంగళవారంతో 62 రోజులకు చేరింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment