సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ను హత్య చేశారని ఆరోపించిన స్వామి ముంబై పోలీసుల ఎఫ్‌ఐఆర్‌పై పలు సందేహాలు వ్యక్తం చేశారు. తన ఆరోపణలకు మద్దతుగా ఓ డాక్యుమెంట్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసిన సుబ్రహ్మణ్యస్వామి ఇందులో పేర్కొన్న 26 పాయింట్లలో 24 పాయింట్లు ఇది హత్యేనని పేర్కొంటున్నాయని వ్యాఖ్యానించారు. స్వామి ట్వీట్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం ఆయన పలు వాదనలను ముందుకుతెచ్చారు. సుశాంత్ రాజ్‌పుత్ మెడపై ఉన్న గుర్తు ఆత్మహత్యతో సరిపోలడం లేదని, ఇది నరహత్యను సూచిస్తోందని అన్నారు. ఈ డాక్యుమెంట్ ప్రకారం సుశాంత్ శరీరంపై కొట్టిన గుర్తులు ఉన్నాయని, ఎలాంటి సూసైడ్ నోట్ లేదని ఇందులో పొందుపరిచారని పేర్కొన్నారు. సుశాంత్ కంటే ముందు బలవన్మరణానికి పాల్పడిన మేనేజర్ దిశా సలియాన్‌కు కొన్ని అంశాలు తెలిసిఉంటాయని చెప్పుకొచ్చారు.
ముంబై పోలీసులు సుశాంత్ కేసులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను అనుసరించారా అని సుబ్రహ్మణ్య స్వామి సందేహం వ్యక్తం చేశారు. సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని స్వామి డిమాండ్ చేశారు. సుశాంత్ మరణంపై ఆయన బుధవారం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో మాట్లాడారు. సుశాంత్ మరణానికి ఆయన మాజీ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి వేధింపులే కారణమని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా సుశాంత్ జూన్ 14న ముంబైలోని బాంద్రా నివాసంలో ఉరి వేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. సుశాంత్ బలవన్మరణంతో సినీ పరిశ్రమలో వేళ్లూనుకున్న బంధుప్రీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. చదవండి : రియాతో బంధం తెంచుకోవాలనుకున్నాడు: అంకిత
Comments
Please login to add a commentAdd a comment