
మైసూరు: ప్రపంచానికి యోగా శాంతిని బోధిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం ఉదయం ప్రఖ్యాత మైసూరు అంబా విలాస్ ప్యాలెస్ ఆవరణలో ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. వేలాది మంది యోగ సాధకులతో కలిసి మోదీ పలు యోగాసనాలను ఆచరించారు. బాలలు, యువత పెద్దసంఖ్యలో తరలిరావడంతో వేడుక కళకళలాడింది. సుమారు నలభై నిమిషాల పాటు వేలాది మంది ఎంతో దీక్షగా ఆసనాలను వేశారు. మోదీ అందరికీ అభివాదం చేస్తూ పలకరిస్తూ రావడంతో జనం ఉత్సాహంగా స్పందించారు.
ప్యాలెస్‌లో మోదీకి అల్పాహార విందు
యోగా కార్యక్రమం తరువాత ప్యాలెస్‌లో రాజ కుటుంబీకులు యదువీర్ ఒడెయర్– త్రిషిక దంపతులు, రాజమాత ప్రమోదాదేవి ఒడెయర్‌లను మోదీ కలిశారు. మసాలా దోసె, మసాలా వడ, సాంబార్, మైసూరు పాక్ లతో కూడిన అల్పాహార విందును ప్రధాని ఆరగించారు. ప్రమోదాదేవి మాట్లాడుతూ తమ ప్యాలెస్‌లో అల్పాహారాన్ని స్వీకరించాలని ప్రధాని మోదీకి ముందే లేఖ రాయగా, ఆయన అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. ఆయనకు ఏ వంటకాలు ఇష్టమైనప్పటికీ, తాము దక్షిణాది వంటకాలనే వడ్డించామని ఆమె చెప్పారు.
యోగా ఎగ్జిబిషన్
ప్యాలెస్ ఆవరణలోని ఉన్న దసరా వస్తు ప్రదర్శనశాలలో యోగాకు సంబంధించిన ఆయుష్ డిజిటల్ ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ప్రధాని వీక్షించారు. సుమారు 15 నిమిషాల పాటు వివిధ స్టాళ్లలోని ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు.
ముగిసిన పర్యటన
మోదీ రెండురోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. ప్యాలెస్‌లో అల్పాహారం స్వీకరించిన అనంతరం ఆయన మండకళ్లి విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. గవర్నర్ గెహ్లాట్, సీఎం బసవరాజ బొమ్మై తదితరులు ఆయనకు వీడ్కోలు పలికారు
(చదవండి: కోర్టులో జడ్జి ముందు కాలు మీద కాలేసుకోవడం తప్పా? నేరమా?)
Comments
Please login to add a commentAdd a comment