తెలంగాణ ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
తుది తీర్పునకు లోబడే తదుపరి నియామకాలు ఉండాలని వెల్లడి
హైకోర్టు తీర్పుపై స్టే.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు
తదుపరి విచారణ నాలుగు వారాలపాటు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్సీలను గవర్నర్ నామి నేట్ చేయడాన్ని నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ నిర్ణయాన్ని ఆపలేమంటూ.. ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. తుది తీర్పునకు లోబడే తదుపరి నియామకాలు ఉండాలని పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ గవర్నర్ శాసనమండలికి సభ్యులను నామినేట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేతో కూడిన ధర్మాసనం విచారించింది.
కోర్టు తుది ఆదేశాలు ఇచ్చే వరకూ హైకోర్టు ఆదేశాలపై స్టేటస్‌కో ఇవ్వాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయ వాది కపిల్ సిబల్ కోరారు. అయితే, ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తామనగా.. సిబల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘అభ్యంతరం ఎందుకు? మీరు హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వచ్చారు కదా. మేం స్టే ఇస్తాం’ అని ధర్మాసనం చెప్పింది. అలా చేయడం వల్ల మళ్లీ నూతన సిఫార్సులు చేసే అవకాశం ఉందని సిబల్ పేర్కొన్నారు. ‘శాసనమండలిలో పిటిషనర్ల నియామకాన్ని గవర్నర్ నిరా కరించినందున కేసు వేయడానికి వారు అర్హులు.
గవర్నర్ పిటిషనర్లను కాకుండా వేరే వారిని నియమించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు వ్యక్తుల నియామక గెజిట్‌ను కూడా హైకోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం అదే వ్యక్తుల్ని నియమించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్ని స్తోంది’ అని సిబల్ వాదించారు. స్టేటస్ కో ఇవ్వడం వల్ల ఉపయోగమేమీ లేదని జస్టిస్ విక్రమ్‌నాథ్ చెప్పారు. అలా ఇవ్వకపోతే కొత్త వారిని నియమించడమో, దీనికి కాలపరి మితి అయిపోతుందనో లేదా ఇంకేదైనా చెబుతారని సిబల్ పేర్కొన్నారు.
‘మీకు పోటీగా మరికొంత మంది సీనియర్ న్యాయవాదులున్నారు కదా.. వారిని కూడా రానివ్వండి.. వారేం చెబుతారో చూద్దాం’ అని జస్టిస్ విక్రమ్‌నాథ్ వ్యాఖ్యా నించారు. అనంతరం.. కోర్టు తుది ఉత్తర్వులు వచ్చే వరకూ హైకోర్టు తీర్పుపై స్టే అమల్లో ఉంటుందని ఆదేశాలు జారీ చేశారు. అయితే, గవర్నర్ మరొకరిని నియమిస్తారని సిబల్ పేర్కొనగా... దానిని ఆపలేమని జస్టిస్ విక్రమ్‌నా«థ్ స్పష్టం చేశారు. పిటిషనర్ నియామకం సరైనదే కాబట్టి నియంత్రించొచ్చని సిబల్ పేర్కొనగా దానికి న్యాయమూర్తి అంగీకరించలేదు.
గవర్నర్ తాజా నామినేషన్‌ను కోర్టు ఆపలేదని జస్టిస్ విక్రమ్‌నా«థ్ తేల్చిచెప్పారు. మంత్రివర్గం సిఫార్సు చేస్తే ఆ నియామకంలో గవర్నర్ పాత్ర ఉండదని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ముందు కేసు పెండింగ్‌లో ఉందని సిబల్ ధర్మాసనం దృష్టికి తెస్తూ.. కేసులో విజయం సాధిస్తే చట్టబద్ధంగా పిటిషనర్ అర్హుడవుతారని చెప్పారు. సిబల్ సూచనను అంగీకరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
విచారణ పూర్తయ్యేలోపు చేసే ప్రతి నామినేషన్ తుది తీర్పునకు లోబడి ఉండాలంటూ ధర్మాసనం ఆదేశాలను సవరించింది. ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment