అడ్డంకులు అధిగమించాం.. విజయం సాధించాం | Supreme Court Decision On SC ST Reservation: Manda Krishnamadiga | Sakshi
Sakshi News home page

అడ్డంకులు అధిగమించాం.. విజయం సాధించాం

Published Fri, Aug 2 2024 5:51 AM | Last Updated on Fri, Aug 2 2024 5:51 AM

Supreme Court Decision On SC ST Reservation: Manda Krishnamadiga

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీం తీర్పు చరిత్రాత్మకం 

ఈ తీర్పు ఎమ్మార్పిఎస్‌ కార్యకర్తల పోరాట ఫలితమే  

వర్గీకరణకు మద్దతు పలికిన వారే వ్యతిరేకించారు

‘సాక్షి’తో ఎమ్మార్పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

సాక్షి, న్యూఢిల్లీ: ‘మాదిగల 30 ఏళ్ల పోరాటానికి తెరపడింది. వర్గీకరణ పోరాటంలో అడుగడుగునా అరెస్టులు.. ఉద్యమాలను అడ్డుకున్నా, పట్టు వీడకుండా న్యాయమైన పోరాటానికి అడుగులు వేశాం. ఉద్యమం ప్రారంభించిన తొలిరోజుల్లో ఎన్ని అడ్డంకులు వచి్చనా వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడి ఈ రోజు వర్గీకరణ సాధించాం. మాదిగల్లో పోరాట స్ఫూర్తిని నింపాం. గ్రామస్థాయి నుంచి నగరస్థాయి వరకు రిజర్వేషన్లపై చైతన్యం తెచ్చాం’ అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచి్చన నేపథ్యంలో మంద కృష్ణమాదిగను ‘సాక్షి’ పలకరించింది. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.... 

ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తల పోరాటం వల్లే..
మాదిగల హక్కుల కోసం 1994 జూలై 7న ‘మాదిగ పోరాట సమితి’ని స్థాపించాను. గ్రామ, మండలస్థాయిలో ఎమ్మారీ్పఎస్‌ కార్యకర్తలు..రాజకీయపారీ్టల కార్యకర్తలకు దీటుగా నిలబడ్డారు. ఎంతోమంది మాదిగలు వర్గీకరణ కోసం బలిదానాలు చేసుకున్న సంఘటనలు నన్ను ప్రతిరోజూ కలచివేస్తుండేవి. ‘అన్నా మేం చనిపోతున్నాం..అయినా సరే పోరాటం ఆపొద్దు.

మీరు ముందుండి ఉద్యమాన్ని నడపండి...ఏదో ఒకరోజు రిజర్వేషన్లు కచి్చతంగా సాధిస్తాం’అంటూ చనిపోయే ముందు కొందరు కార్యకర్తలు నాతో మాట్లాడిన మాటలు ప్రతిరోజూ నేను గుర్తు చేసుకుంటూ పోరాటాలకు పిలుపునిచ్చేవాడిని. వారి కన్నీళ్ల ప్రతిఫలమే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు. 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు బలంగా ఉంటూ, పోరాటాలు చేశారు. ఎంతో మంది నాయకులు మా కార్యకర్తలపై భౌతికంగా దాడులు చేసినా, వేధించినా, కేసులు పెట్టినా భయపడకుండా ధైర్యంగా నిలబడ్డారు. ఎమ్మారీ్పఎస్‌ పోరాటస్ఫూర్తి వల్లనే ఈరోజు విజయం సాధించాం.  

ఎంతో మంది సహకరించారు
మేం చేసిన ఈ పోరాటానికి ఎంతోమంది మద్దతు పలికారు. అనేక పర్యాయాలు ఆర్థికపరమైన సాయం, మాట సాయం, న్యాయపరమైన సాయాలు ఎందరో చేశారు. వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  ఆ ఐదుగురు అలా..ఈ ఐదుగురు ఇలా2004లో జస్టిస్‌ సంతోష్‌హెగ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం రిజర్వేషన్లు చెల్లవు అంటూ రద్దు చేసింది. ఆ తర్వాత 2020లో అరుణ్‌మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల «ధర్మాసనం రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేయొచ్చని తీర్పు ఇచ్చింది.ఇదే సందర్భంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై న్యాయం చెప్పాలని సూచనలు చేసింది. ఆ సూచనల కారణంగానే తాజాగా రిజర్వేషన్లపై తీర్పు రావడం ఆనందంగా ఉంది. ముందేమో ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం వ్యతిరేకించింది, ఆ తర్వాతే
మరో ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.  

ఉమ్మడి ప్రయోజనాల కోసం పోరాడుదాం 
వర్గీకరణ కోసం మేం పోరాటాలు చేస్తుంటే మా మాల సోదరులు రోడ్డెక్కి అడ్డుచెప్పేవారు. కానీ, కొంతకాలంగా వారి మనసులు మారాయి, మా పోరాటాలకు ఎవరూ అడ్డు పడలేదు. ఇకపై ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎస్సీలందరం కలిసి పోరాడాల్సిన అవసరముంది. 2004లో తెచి్చన చట్టాన్నే ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తే సరిపోతుంది. ఇక తెలంగాణలో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాల్సి ఉంది. వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టొద్దని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా.

సీఎంకు మాదిగ ఎమ్మెల్యేల స్వీట్లు
సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పు నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డికి మిఠాయిలు తినిపించారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో డప్పు చప్పుళ్లతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కడియం శ్రీహరి, కాలె యాదయ్య, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్య నారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, శామేలు, తోట లక్ష్మీకాంతరావు తదితరులున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు చారకొండ వెంకటేశ్, గజ్జెల కాంతం, దేవని సతీశ్, మాజీ మంత్రి పుష్పలీల కూడా సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement