సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్‌లో ఆదిలాబాద్‌లో తుపాకీ కాల్పులు జరిపి ఒకరు మృతి, మరో ఇద్దరు గాయపడటానికి కారణమైన ఎంఐఎం నేత ఫరూఖ్ అహ్మద్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సవాల్‌చేస్తూ ఫరూఖ్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ వినీత్ శరణ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వీకే శుక్లా వాదనలు వినిపిస్తూ అనారోగ్యం దృష్ట్యా ఫరూఖ్‌కు బెయిలివ్వాలని అభ్యర్థించారు.
‘‘పిటిషనర్‌పై 302, 307, 324, ఆయుధాల చట్టానికి సంబంధించిన అన్ని సెక్షన్లు ఉన్నాయి. భయభ్రాంతులకు గురిచేస్తూ క్రూరంగా కాల్పులు జరిపారు. బెయిలు కోరడమంటే తల్లిదండ్రులను చంపి అనాథను అన్నట్లుగా ఉంది’’ అని జస్టిస్ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. పిటిషనర్ ఆరోగ్యం సరిగాలేదని జైలులో ఆత్మహత్యకు యత్నించారని వీకే శుక్లా తెలిపారు. ‘ఓ వ్యక్తిని చంపారు. మరొకరు అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు. అరెస్టు తర్వాత ఆత్మహత్యాయత్నం చేశారు. ఇన్ని ఆధారాలున్నా బెయిలు కోరుతున్నారా’ అని వీకే శుక్లాను జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. అనంతరం బెయిల్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment