
న్యూఢిల్లీ: గుజరాత్‌లో 2002 గోధ్రా ఘర్షణల తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు బుధవారం సెతల్వాద్‌కు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను త్రిసభ్య బెంచ్ తోసిపుచ్చింది.
గోధ్రా హింసాకాండ కేసుల్లో అమాయకుల్ని ఇరికించడానికి సాక్ష్యాలను తారుమారు చేశారని తీస్తా సెతల్వాద్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సెతల్వాద్‌పై చార్జిషీటు నమోదు కావడంతో ఆమెను మళ్లీ కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘‘తీస్తా సెతల్వాద్ ఇప్పటికే తన పాస్‌పోర్టును సెషన్స్ కోర్టుకు సమర్పించారు. ఆమె సాక్షులను ఎవరినీ ప్రభావితం చేయడానికి వీల్లేదు. వారికి దూరంగా ఉండాలి’’ అని సుప్రీం బెంచ్ ఆదేశించింది. ఈ కేసులో తీస్తా సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని పోలీసులు భావిస్తే నేరుగా సుప్రీంను ఆశ్రయించవచ్చునని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment