న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన గణతంత్ర రైతు పరేడ్ (ట్రాక్టర్ ర్యాలీ)లో చెలరేగిన హింసపై దాఖలైన పిటిషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ట్రాక్టర్ ర్యాలీలో హింసపై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్లు తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. పిటిషన్లను తిరస్కరించిన సీజేఐ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనంసున్నితమైన అంశంలో కేంద్రం చట్టపరంగా స్పందిస్తుందని తెలిపింది. దీంతో ఈ పిటిషన్లను ఉపసంహరించుకోవాలని పిటిషనర్లకు సీజేఐ సూచించారు.
జనవరి 26వ తేదీన రైతుల గణతంత్ర పరేడ్ (ట్రాక్టర్ ర్యాలీ) హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. రైతులు బారికేడ్లు తెంచుకుని.. పోలీసుల అడ్డంకులను దాటి ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. ఈ హింసాత్మకంగా మారిన ఘటనలపై న్యాయవాదులు విశాల్ తివారీ, మనోహర్ లాల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలవడంతో బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ పిటిషన్లన్నింటిని తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ఇది సున్నితమైన అంశమని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం చట్టపరంగా స్పందిస్తుందని ధర్మాసనం తెలిపింది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాలని పిటిషన్లకు న్యాయస్థానం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment